భారత రక్షణ వ్యవస్థను అలనాటి ఆస్ట్రేలియా బౌలర్లతో పోల్చిన డీజీఎంవో రాజీవ్ ఘాయ్

  • 'ఆపరేషన్ సిందూర్'పై డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ ప్రెస్ మీట్
  • భారత బహుళస్థాయి కౌంటర్ డ్రోన్, ఎయిర్ డిఫెన్స్ గ్రిడ్ వివరిస్తూ క్రికెట్ ప్రస్తావన
  • 1970ల నాటి ఆస్ట్రేలియా పేసర్లు లిల్లీ, థామ్సన్‌లతో వ్యవస్థను పోల్చిన వైనం
  • "థామ్సన్ కాకుంటే లిల్లీ పడగొడతాడు" అనే నానుడిని ఉటంకిస్తూ రక్షణ సామర్థ్యం వెల్లడి
భారత సైన్యానికి చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. 'ఆపరేషన్ సిందూర్' పై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్లు డెన్నిస్ లిల్లీ, జెఫ్ థామ్సన్‌ల పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించారు. గత నెలలో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని తిప్పికొట్టడంలో కీలక పాత్ర పోషించిన భారత యాంటీ డ్రోన్, ఎయిర్ డిఫెన్స్ గ్రిడ్ గురించి వివరిస్తున్న సందర్భంలో ఆయన ఈ పోలికను తీసుకొచ్చారు.

"ఈ రోజు విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ఎంతో మంది అభిమానుల్లాగే నాక్కూడా ఆయన ఇష్టమైన క్రికెటర్. అందుకే ఇప్పుడు క్రికెట్ గురించి మాట్లాడుకుందాం" అంటూ  పోలికను తీసుకు వచ్చారు.

పాకిస్థాన్ దాడులను భారత్ ఎదుర్కొన్న తీరును 1970ల నాటి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ్యాచ్‌తో పోల్చారు. అప్పుడు జెఫ్ థామ్సన్, డెన్నిస్ లిల్లీలు ఒకరు కాకపోతే మరొకరు వికెట్లు పడగొడతారని నానుడి ఉండేదని, అలాగే భారత రక్షణ వ్యవస్థలు ప్రత్యర్థి దాడులను అడ్డుకున్నాయని అభిప్రాయపడ్డారు.

"నాకు 1970ల నాటి ఒక సంఘటన గుర్తుకు వస్తోంది. ఆ సమయంలో క్రికెట్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య యాషెస్ వైరం తారస్థాయిలో ఉండేది. ఆస్ట్రేలియాకు చెందిన జెఫ్ థామ్సన్, డెన్నిస్ లిల్లీ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పేసర్లలో ఉండేవారు" అని జనరల్ ఘాయ్ గుర్తు చేసుకున్నారు.

"థామ్సన్ కు మీరు దొరక్కపోతే, లిల్లీకి తప్పక దొరుకుతారు. అలాగే, ఇప్పుడు మన రక్షణ అంచెలు కూడా అలాగే ఉన్నాయి... ఒక అంచెలో తప్పించుకుంటే, మరో అంచెలో దెబ్బతింటారు" అని ఆయన వివరించారు. "ఒకవేళ మీరు (పాకిస్థాన్‌‍ను ఉద్దేశించి) అన్ని వ్యవస్థలను దాటుకుని వచ్చినా, ఈ బహుళస్థాయి గ్రిడ్ వ్యవస్థలోని ఏదో ఒక అంచె మిమ్మల్ని కచ్చితంగా కూల్చివేస్తుంది" అని రాజీవ్ ఘాయ్ అన్నారు.


More Telugu News