దక్షిణ భారత డిజిటల్ పబ్లిషర్స్ ఒకే గొడుగు కిందకు... 'సిడ్పా' ఏర్పాటు!

  • డిజిటల్ వార్తా సంస్థలు, స్వతంత్ర జర్నలిస్టుల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యం
  • పత్రికా స్వేచ్ఛ, నైతిక జర్నలిజం ప్రోత్సాహానికి పెద్దపీట
  • సిడ్పా సభ్యుల డిజిటల్ వీక్షకుల సంఖ్య పలు సంప్రదాయ పత్రికలను అధిగమించిందని వెల్లడి
  • సంఘానికి ఛైర్మన్‌గా వెంకట్ అరికట్ల, ప్రధాన కార్యదర్శిగా ప్రదీప్ వై
దక్షిణ భారతదేశంలోని డిజిటల్ వార్తా ప్రచురణ రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వార్తా ప్రచురణ సంస్థలు, డిజిటల్ మీడియా రంగంలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్వతంత్ర పాత్రికేయుల ప్రయోజనాలను కాపాడే లక్ష్యంతో "సౌత్ ఇండియా డిజిటల్ పబ్లిషర్స్ అసోసియేషన్ (SIDPA - సిడ్పా)"  ఏర్పాటైంది. లాభాపేక్ష రహిత సంస్థగా ఆవిర్భవించిన ఈ కూటమి, డిజిటల్ వేదికలపై నాణ్యమైన బ్రాండెడ్ కంటెంట్ అందించే వారందరికీ ఒక ఉమ్మడి గొంతుకగా నిలవనుంది.

ముఖ్య ఉద్దేశ్యాలు, ప్రాముఖ్యత
ప్రాంతీయ డిజిటల్ వేదికలన్నీ ప్రప్రథమంగా ఒకే గొడుగు కిందకు వచ్చాయి. ఈ పరిణామం దక్షిణ భారతదేశ డిజిటల్ మీడియా వ్యవస్థలో ఒక మైలురాయిగా నిలుస్తుందని సిడ్పా ప్రతినిధులు తెలిపారు. పత్రికా స్వేచ్ఛను బలోపేతం చేయడం, నైతిక జర్నలిజపు విలువలను ప్రోత్సహించడం తమ ప్రాథమిక లక్ష్యాలని వారు స్పష్టంచేశారు. స్వతంత్ర ప్రచురణకర్తల మధ్య ఐక్యతకు ప్రాధాన్యతనిస్తూ, దక్షిణ భారతదేశ డిజిటల్ మీడియాకు ఇది ఒక నిర్ణయాత్మక ఘట్టమని అసోసియేషన్ అభివర్ణించింది.

సిడ్పా వెబ్ సైట్లకు జనాదరణ
డిజిటల్ వార్తా వినియోగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సిడ్పా సభ్యుల వెబ్‌సైట్ల వీక్షకుల సంఖ్య పలు సంప్రదాయ వార్తాపత్రికలను ఇప్పటికే అధిగమించింది. దీర్ఘకాలంగా కొనసాగుతున్న ముద్రణ మాధ్యమాలు మరియు టీవీ ఛానెళ్ల యాజమాన్యంలోని పోర్టల్‌ల కంటే కొన్ని డిజిటల్ వేదికలకే పాఠకుల ఆదరణ ఎక్కువగా ఉంది. వార్తాపత్రికలు, టెలివిజన్ వార్తా పోర్టల్‌లతో సహా మొత్తం డిజిటల్ వార్తా ట్రాఫిక్‌లో సిడ్పా సభ్యుల వెబ్సైట్ల వీక్షకుల వాటా గణనీయంగా ఉండటం, స్వతంత్ర డిజిటల్ జర్నలిజం పట్ల పాఠకుల విశ్వాసం, ఆదరణ పెరుగుతోందనడానికి నిదర్శనంగా నిలుస్తోంది.

వ్యవస్థాపక సభ్యులు వీరే..
సిడ్పా వ్యవస్థాపక సభ్యులలో పలు ప్రముఖ డిజిటల్ మీడియా సంస్థల ప్రతినిధులు ఉన్నారు. వీరిలో ఎం9 న్యూస్ నుంచి కళ్యాణ్ కొల్లి, ఇండియన్ క్లిక్స్ నుంచి కృష్ణ మందలపు, గుల్టే నుంచి నాగేంద్ర ఆరుమిల్లి, తెలుగు360 నుంచి ప్రదీప్ వై, ఏపీ7ఏఎం నుంచి శ్రీనివాసరావు చిలుకూరి, 123తెలుగు నుంచి వంశీ రెడ్డి ఎన్, గ్రేట్ ఆంధ్ర నుంచి వెంకట్ అరికట్ల, తుపాకి నుంచి వెంకటేశ్వర రెడ్డి ఇల్లూరి ఉన్నారు. ప్రస్తుతం దక్షిణ భారతదేశంలోని 20కి పైగా డిజిటల్ ప్రచురణకర్తలు ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నారు.

సవాళ్లను సమష్టిగా ఎదుర్కొంటాం..
పత్రికా స్వేచ్ఛను కాపాడుతూనే, జర్నలిజంలో ఉన్నత నైతిక ప్రమాణాలను పెంపొందించడం సిడ్పా ధ్యేయం. ప్రాంతీయ ప్రసార మాధ్యమాలు పెరుగుతున్న పరిశీలన, ఒత్తిడిని ఎదుర్కొంటున్న ప్రస్తుత మీడియా వాతావరణంలో, దక్షిణ భారతదేశంలో ప్రేక్షకులకు సేవలందిస్తున్న డిజిటల్ ప్రచురణ రంగానికి సిడ్పా ఒక సమీకృత శక్తిగా పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. డిజిటల్ జర్నలిజం, మీడియా రంగాలకు దీర్ఘకాలంగా సేవలందిస్తున్న ప్రముఖులతో కూడిన ఒక అంతర్గత కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు సిడ్పా ప్రకటించింది. డిజిటల్ మీడియా ఎదుర్కొంటున్న సవాళ్లను సమష్టిగా ఎదుర్కోవడంతో పాటు, సభ్యులందరికీ ప్రయోజనం చేకూరేలా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు నూతన కార్యవర్గం సూచనప్రాయంగా వెల్లడించింది.

సిడ్పా కార్యవర్గం
ఛైర్మన్: వెంకట్ అరికట్ల
వైస్ ఛైర్మన్: వెంకటేశ్వర రెడ్డి ఇల్లూరి
ప్రధాన కార్యదర్శి: ప్రదీప్ వై
కోశాధికారి: కృష్ణ మందలపు

మరింత సమాచారం కొరకు: sidpa.org 
ఫాలో SIDPA @ ఎక్స్: https://x.com/southidpa 


More Telugu News