లోయలో పడ్డ బస్సు.. శ్రీలంకలో 21 మంది దుర్మరణం

  • కోట్‌మలె వద్ద అదుపుతప్పి లోయలో పడ్డ యాత్రికుల బస్సు
  • 35 మంది ప్రయాణికులకు గాయాలు
  • ఇద్దరు చిన్నారులు సహా 15 మంది పరిస్థితి విషమం
శ్రీలంకలో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. యాత్రికులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో బస్సులోని ప్రయాణికులలో 21 మంది మరణించగా, మరో 35 మందికి పైగా గాయపడ్డారు. ఇందులో ఇద్దరు చిన్నారులు సహా 15 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.

వివరాల్లోకి వెళితే.. శ్రీలంకలోని దక్షిణ ప్రాంత యాత్రాస్థలమైన కతర్‌గామ నుంచి వాయువ్య ప్రాంతంలోని కురునేగలకు 75 మంది ప్రయాణికులతో ఒక ప్రభుత్వ బస్సు బయలుదేరింది. ఉదయం 11 గంటల సమయంలో కోట్‌మలె సమీపంలోని కొండ ప్రాంతంలో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు మలుపు తిరుగుతుండగా డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో, అది రోడ్డు పక్కకు దూసుకెళ్లి దాదాపు 100 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది.

ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. శ్రీలంక రవాణా, రహదారుల శాఖ ఉప మంత్రి ప్రసన్న గుణసేన మృతుల సంఖ్యను ధ్రువీకరించారు. ఈ దురదృష్టకర సంఘటనపై ప్రభుత్వం దర్యాప్తు చేపడుతుందని ఆయన వెల్లడించారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు దర్యాప్తు అనంతరం తెలుస్తాయని అధికారులు పేర్కొన్నారు.


More Telugu News