భార‌త్ నుంచి మ‌న‌ల్ని కాపాడేది అమెరికానే: పాక్ మాజీ అధికారి కీల‌క వ్యాఖ్య‌లు

  • పాకిస్థాన్ విశ్రాంత ఎయిర్ మార్ష‌ల్ మ‌సూద్ అక్త‌ర్ ఆవేద‌న‌
  • భారత్ వ‌ద్ద‌ 16 లక్షల మంది సైన్యం ఉంటే.. పాక్ వ‌ద్ద కేవ‌లం 6 ల‌క్ష‌లే అన్న మాజీ అధికారి
  • పాక్‌ ఆర్మీ ఎంత యుద్ధం చేసినా మన‌ల్ని రక్షించద‌న్న మ‌సూద్ అక్త‌ర్‌
  • భార‌త్ మీద‌ అమెరికా ఒత్తిడి తెచ్చే వరకు ఈ ఉద్రిక్తతలను తగ్గించలేమ‌ని వ్యాఖ్య‌
  • ఇలాగే కొన‌సాగితే పరిస్థితి మరింత దిగజారి, పాక్‌ బాగా న‌ష్ట‌పోతుంద‌ని వెల్ల‌డి
త‌మ‌ను భార‌త్ నుంచి అమెరికానే కాపాడాల‌ని పాకిస్థాన్ విశ్రాంత ఎయిర్ మార్ష‌ల్ మ‌సూద్ అక్త‌ర్ ఓ టీవీ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన వీడియో ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. పాకిస్థాన్‌కు చెందిన‌ డాన్ టీవీ నుంచి తీసుకున్న‌ ఒక నిమిషం నిడివి గల క్లిప్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. అధికారి తమ వద్ద కేవలం ఆరు లక్షల మంది సైనికులు మాత్రమే ఉన్నారని, భారత్ వ‌ద్ద‌ 16 లక్షల మంది సైన్యం ఉంద‌ని ఆయ‌న అన్నారు. పాకిస్థాన్ ఆర్మీ ఎంత 'ఘజ్వా' (యుద్ధం) చేసినా మమ్మల్ని రక్షించద‌ని ఆయన పేర్కొన్నారు.

మసూద్ అక్తర్ ఇంకా మాట్లాడుతూ... "యుద్ధ‌ దృశ్యాలు ఆందోళనకరంగా ఉన్నాయి. దానికి మా దగ్గర సమాధానం లేదు. ఇలాగే కొన‌సాగితే పరిస్థితి మరింత దిగజారుతోంది. భార‌త్ మీద‌ అమెరికా ఒత్తిడి తెచ్చే వరకు ఈ ఉద్రిక్తతలను తగ్గించడం కుద‌ర‌దు. నాలుగు సందర్భాలలో ఇండియా భారీ దాడులను ప్రారంభించాలని ప్లాన్ చేసింది. ఇలాంటి స‌మ‌యంలో మనం నిజంగా ఏమి చేయాలో ఆలోచించాలి. లేకపోతే పరిస్థితి మరింత దిగజారిపోతుంది. అప్పుడు మ‌నం మ‌రింత న‌ష్ట‌పోతాం" అని ఆయ‌న వ్యాఖ్యానించారు.

ఇక, మే 7న భార‌త్ చేపట్టిన ఆప‌రేష‌న్ సిందూర్ తర్వాత న్యూఢిల్లీపై చర్య పేరుతో పాకిస్థాన్ ప్రభుత్వం భారతదేశంపై క్షిపణులను ప్రయోగిస్తోంది. సరిహద్దులో భారీ షెల్లింగ్‌కు పాల్పడుతున్న విష‌యం తెలిసిందే. దీంతో భార‌త బ‌ల‌గాలు పాక్ డ్రోన్‌, క్షిప‌ణి దాడుల‌ను స‌మ‌ర్థ‌త‌వంతంగా తిప్పికొడుతున్నాయి. 


More Telugu News