Ananta Babu: అన్నవరం ఆలయంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దూషణలు.. వాడు, వీడు అంటూ అధికారిపై మండిపాటు

Annavaram Temple MLC Ananta Babus abusive behavior sparks outrage
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణస్వామి వారి దేవస్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ (అనంతబాబు) చిందులు తొక్కారు. స్వామివారి కల్యాణోత్సవం అనంతరం అక్షింతలు అందజేయడంలో జాప్యం జరిగిందంటూ ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అన్నవరం సత్యదేవుని ఆలయంలో గురువారం స్వామివారి కల్యాణ వేడుక శాస్త్రోక్తంగా జరిగింది. కార్యక్రమం ముగిసిన తర్వాత భక్తులకు, అతిథులకు అక్షింతలు పంపిణీ చేయాల్సి ఉండగా, అవి అనంతబాబుకు చేరడంలో కొంత ఆలస్యమైంది. దీంతో ఆయన అసహనానికి గురయ్యారు. తనకు తగిన గౌరవం దక్కలేదని, అక్షింతలు కూడా సకాలంలో అందించలేదంటూ అసహనానికి గురయ్యారు.

ముఖ్యఅతిథులు కల్యాణ వేదిక నుంచి వెళ్లిపోయినప్పటికీ అక్షింతలు అందేంతవరకు అనంతబాబు అక్కడే నిలబడిపోయారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) సుబ్బారావును గుర్తించి తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ఆలయ అధికారుల తీరుపై మండిపడుతూ ఓ అధికారిని ఉద్దేశించి, "వాడెవడు.. వాడి పెత్తనం ఏమిటిక్కడ?..ఓవరాక్షన్‌.. వేషాలు" అంటూ తీవ్ర పదజాలంతో దూషణలకు దిగినట్లు సమాచారం. ఈ ఘటనతో అక్కడున్నవారు నిర్ఘాంతపోయారు.

పరిస్థితిని చక్కదిద్దేందుకు ఈవో సుబ్బారావు, ఎమ్మెల్సీ అనంతబాబు చేతులు పట్టుకుని ఆయనను శాంతింపజేయడానికి ప్రయత్నించారు. కొంతసేపు అక్కడ ఈ వ్యవహారంపై చర్చ జరిగిన అనంతరం ఎమ్మెల్సీ అనంతబాబు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన ఆలయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Go Back to Shorts
Ananta Babu
YSR Congress Party
Mlc Ananta Udayabaskar
Annavaram Temple
Annavaram Satyavaradevaru Temple
Temple Official
Abuse
Controversy
Andhra Pradesh Politics
Religious Event

More Telugu News