నూతన పోప్‌గా కార్డినల్ రాబర్ట్ ప్రివోస్ట్... అమెరికా నుంచి తొలి పోప్!

  • అమెరికాకు చెందిన కార్డినల్ రాబర్ట్ ప్రివోస్ట్ నూతన పోప్‌గా ఎన్నిక
  • లియో-14 పేరుతో బాధ్యతలు చేపట్టనున్న 267వ పోప్
  • చరిత్రలో తొలిసారి అమెరికా వ్యక్తికి పోప్ పీఠం
  • దక్షిణ అమెరికాలో మిషనరీగా, వాటికన్‌లో కీలక పదవిలో అనుభవం
  • పోప్ ఫ్రాన్సిస్ సంస్కరణలు కొనసాగించే అవకాశం
ప్రపంచ క్యాథలిక్ క్రైస్తవుల మత గురువుగా, నూతన పోప్ గా అమెరికాకు చెందిన కార్డినల్ రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రీవోస్ట్ ఎన్నికయ్యారు. ఆయన లియో-14 పేరుతో బాధ్యతలు స్వీకరించనున్నారు. సిస్టీన్ చాపెల్ పైనుంచి తెల్లటి పొగ వెలువడటంతో, కాన్‌క్లేవ్ రెండో రోజే నూతన పోప్ ఎన్నిక పూర్తయినట్లు సంకేతాలు వెలువడ్డాయి. 69 ఏళ్ల ప్రీవోస్ట్, చరిత్రలో పోప్‌గా ఎన్నికైన తొలి అమెరికన్ కావడం విశేషం.

చికాగో, ఇల్లినాయిస్‌కు చెందిన ప్రీవోస్ట్, ప్రపంచవ్యాప్త అనుభవమున్న నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన తన వృత్తి జీవితంలో ఎక్కువ భాగం దక్షిణ అమెరికాలో మిషనరీగా గడిపారు. పెరూలో బిషప్‌గా కూడా సేవలందించారు. ఇటీవలి కాలం వరకు వాటికన్‌లో బిషప్‌ల నియామకాలకు సంబంధించిన కీలక కార్యాలయానికి ఆయన నాయకత్వం వహించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న 140 కోట్ల మంది క్యాథలిక్‌లకు ఆయన ఆధ్యాత్మిక మార్గదర్శిగా వ్యవహరించనున్నారు. పోప్ ఫ్రాన్సిస్ చేపట్టిన సంస్కరణలను లియో-14 కొనసాగిస్తారని భావిస్తున్నారు.

దాదాపు దశాబ్దకాలం పాటు పెరూలోని ట్రుజిల్లోలో పనిచేసిన ప్రీవోస్ట్, ఆ తర్వాత 2014 నుంచి 2023 వరకు పెరూలోని మరో నగరమైన చక్లాయోకు బిషప్‌గా వ్యవహరించారు. ఆయనకు 2015 నుంచి పెరూ పౌరసత్వం కూడా ఉంది. "నేను ఇప్పటికీ నన్ను ఒక మిషనరీగానే భావిస్తాను. ప్రతి క్రైస్తవుడిలాగే, ఎక్కడున్నా సువార్తను ప్రకటించడమే నా కర్తవ్యం" అని బిషప్‌ల డికాస్టరీకి నాయకుడైన తర్వాత వాటికన్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు.

పోప్‌గా ఎన్నికైన అనంతరం సెయింట్ పీటర్స్ బేసిలికా ప్రార్థనామందిరం బాల్కనీ నుంచి తొలిసారిగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన పోప్ లియో-14, "మీ అందరికీ శాంతి కలుగుగాక" అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. "ఇది పునరుత్థానం చెందిన క్రీస్తు తొలి పలుకులు, దేవుని కోసం తన జీవితాన్ని అర్పించిన మంచి కాపరి మాటలివి. ఈ శాంతి సందేశం మన హృదయాల్లోకి, మన కుటుంబాల్లోకి ప్రవేశించాలని నేను ఆకాంక్షిస్తున్నాను" అని ఆయన పేర్కొన్నారు. ఈ సమయంలో బాల్కనీ కింద గుమికూడిన జనసందోహానికి అభివాదం చేస్తూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఎన్నికల ప్రక్రియలో 133 మంది ఓటు హక్కు కలిగిన కార్డినల్స్ పాల్గొన్నారు. వారిలో ఎవరైనా పోప్‌గా ఎన్నిక కావాలంటే మూడింట రెండొంతుల ఓట్లు సాధించాల్సి ఉంటుంది.



More Telugu News