మాజీ సైనికుడిగా... ఆపరేషన్ సిందూర్‌పై ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • ఆపరేషన్ సిందూర్ ద్వారా పాక్‌కు సైన్యం గుణపాఠమన్న మంత్రి
  • పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై విజయవంతమైన దాడులు
  • మాజీ సైనికుడిగా భారత బలగాలకు ఉత్తమ్ అభినందనలు
పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' విజయవంతం కావడం పట్ల తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. భారత సాయుధ బలగాలు పాకిస్థాన్‌కు తగిన రీతిలో బుద్ధి చెప్పాయని ఆయన అన్నారు. మాజీ సైనికుడిగా, భారత సైన్యం ప్రదర్శించిన పరాక్రమానికి అభినందనలు తెలియజేస్తున్నట్టు వెల్లడించారు.

జమ్ముకశ్మీర్‌లో ఇటీవల భారతీయ పర్యాటకులపై పాకిస్థాన్ ఉగ్రమూకలు జరిపిన దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ దాడులను ప్రపంచ దేశాలు ఖండించగా, పాకిస్థాన్‌కు గట్టి సమాధానం ఇస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. దీనికి అనుగుణంగా, భారత త్రివిధ దళాలు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై 'ఆపరేషన్ సిందూర్' పేరిట దాడులు నిర్వహించి, విజయవంతంగా లక్ష్యాలను ఛేదించాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో వెంకటేశ్వర మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కోదాడ పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఆసుపత్రిని ఏర్పాటు చేశారని, నిర్వాహకులను అభినందించారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో భారత వాయుసేన యుద్ధ విమాన పైలెట్ అని తెలిసిందే. ఆయన మిగ్-21 తదితర ఫైటర్ జెట్లకు పైలెట్ గా విధులు నిర్వర్తించారు. 


More Telugu News