ఏపీ లిక్క‌ర్ స్కామ్‌లో కీల‌క ప‌రిణామం.. రంగంలోకి ఈడీ!

వివ‌రాల కోసం సిట్ అధిపతి, విజయవాడ సీపీకి లేఖ రాసిన ఈడీ
ఇప్ప‌టివ‌వ‌ర‌కు అరెస్ట్ చేసిన నిందితుల వివ‌రాలు, రిమాండ్ రిపోర్టులు కావాలన్న ఈడీ
ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్-2002 ప్ర‌కారం కేసు ద‌ర్యాప్తు చేస్తామ‌ని వెల్ల‌డి
ఏపీలో లిక్కర్ స్కాం కేసులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ కేసును ద‌ర్యాప్తు చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సిద్ధ‌మైంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్-2002 ప్ర‌కారం కేసు ద‌ర్యాప్తు చేస్తామ‌ని ఈడీ తెలిపింది. ఇందులో భాగంగా ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల‌ను త‌మ‌కు అంద‌జేయాల్సిందిగా సిట్ అధిపతి, విజయవాడ సీపీకి ఈడీ తాజాగా లేఖ రాసింది. 

అలాగే కేసుకు సంబంధించిన 21/2024 ఎఫ్‌ఐఆర్ వివ‌రాలు, ఇప్పటి వరకు సీజ్ చేసిన బ్యాంక్ ఖాతాల‌ వివరాలు పంపాలని ఈడీ లేఖ‌లో పేర్కొంది. అలాగే ఇప్ప‌టివ‌వ‌ర‌కు ఈ కేసులో అరెస్ట్ చేసిన నిందితుల వివ‌రాలు, రిమాండ్ రిపోర్టులు త‌మ‌కు అంద‌జేయాల‌ని కోరింది. ఈ కేసులో అరెస్ట‌యిన నిందితుల‌పై ఛార్జిఫీట్ న‌మోదు చేస్తే వాటి కాపీల‌ను కూడా ఇవ్వాల‌ని తెలిపింది.  


కాగా, లిక్కర్ స్కాం‌కు సంబంధించి సిట్ ఇప్పటికే ఎంతో సమాచారాన్ని సేకరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు ఆయన పీఏ పైలా దిలీప్‌ను అరెస్ట్ చేసింది. వారిని కస్టడీలోకి తీసుకుని మ‌ద్యం కుంభ‌కోణానికి సంబంధించి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. 

అలాగే ఈ కేసులో మరికొన్ని అరెస్ట్‌లు కూడా జరిగాయి. ఈ కేసుకు సంబంధించి పలువురికి నోటీసులు ఇచ్చిన సిట్ అధికారులు వారిని విచారించారు. లిక్కర్ స్కాం కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ తమకు మధ్యంతర రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు, సుప్రీం కోర్టులను కోరినప్పటికీ వారికి నిరాశే ఎదురైంది.


More Telugu News