ధ‌ర్మ‌శాల‌లో జ‌ర‌గాల్సిన‌ ఐపీఎల్ మ్యాచ్‌.. అహ్మ‌దాబాద్‌కు త‌ర‌లింపు

  • ఈ నెల 11న పీబీకేఎస్‌, ఎంఐ మ‌ధ్య మ్యాచ్‌
  • లాజిస్టిక్స్ కార‌ణాల వ‌ల్ల వేదిక‌ను మార్చిన‌ట్లు బీసీసీఐ వెల్ల‌డి
  • వేదిక మార్పును ధృవీకరించిన జీసీఏ కార్యదర్శి అనిల్ పటేల్  
ఐపీఎల్‌ 2025లో భాగంగా పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌), ముంబ‌యి ఇండియ‌న్స్ (ఎంఐ) జ‌ట్ల మ‌ధ్య ఈ నెల 11న జ‌ర‌గాల్సిన మ్యాచ్ వేదిక‌ను మార్చారు. ధ‌ర్మ‌శాల‌లో జ‌ర‌గాల్సిన మ్యాచ్ ను... అహ్మ‌దాబాద్‌కు మారుస్తున్న‌ట్లు బీసీసీఐ ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. లాజిస్టిక్స్ కార‌ణాల వ‌ల్ల వేదిక‌ను మార్చిన‌ట్లు పేర్కొంది. 

గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (జీసీఏ) కార్యదర్శి అనిల్ పటేల్ ఈ పరిణామాన్ని ధృవీకరించారు. ఈ మ్యాచ్ మధ్యాహ్నం జరుగుతుందని తెలిపారు. "బీసీసీఐ మమ్మల్ని అభ్యర్థించింది. మేము అంగీకరించాం. ముంబ‌యి ఇండియన్స్ జ‌ట్టు ఈ రోజు అహ్మదాబాద్‌కు చేరుకుంటుంది. పంజాబ్ కింగ్స్ ప్రయాణ ప్రణాళికలు తర్వాత తెలుస్తాయి" అని పటేల్ అన్నారు.

అయితే, వేదిక మార్పుపై బీసీసీఐ ఇంకా తమ ఫ్రాంచైజీకి తెలియజేయలేదని పంజాబ్ కింగ్స్ అధికారి ఒకరు తెలిపారు. "బీసీసీఐ నుంచి మాకు ఇంకా ఎటువంటి సమాచారం అందలేదు. పూర్తి స్పష్టత వచ్చిన తర్వాతే ప్రయాణ ప్రణాళికలను మేము రూపొందిస్తాం" అని అన్నారు.  

కాగా, ఈరోజు ధ‌ర్మ‌శాల‌లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌)తో ఢిల్లీ క్యాపిట‌ల్స్ (డీసీ) ఆడ‌నుంది. ఈ మ్యాచ్ య‌ధావిధిగా రాత్రి 7.30 గంట‌ల‌కు జ‌రుగుతుంది. ఇండోపాక్ సరిహ‌ద్దుల్లో షెల్లింగ్ జ‌రుగుతున్న నేప‌థ్యంలో.. ఉత్త‌ర‌, ప‌శ్చిమ న‌గ‌రాల్లో ఉన్న విమానాశ్ర‌యాల‌ను మూసివేశారు. కొన్నింటిలో ఆల‌స్యంగా విమానాలు న‌డుస్తున్నాయి. మిలిట‌రీ దాడుల నేప‌థ్యంలో ధ‌ర్మ‌శాల విమానాశ్ర‌యంలో మే 10 వరకు వాణిజ్య విమానాల‌ను ర‌ద్దు చేశారు.




More Telugu News