TDP: 'ఆపరేషన్ సిందూర్' పై టీడీపీ నేతల హర్షం... వందేమాతరం నినాదాలతో మార్మోగిన పార్టీ ఆఫీసు

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' ద్వారా తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం పట్ల తెలుగుదేశం పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నేతలు 'వందేమాతరం' నినాదాలతో భారతమాతకు జయజయధ్వానాలు పలికారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ఉగ్రవాదులపై భారత సైన్యం జరిపిన దాడి దేశం గర్వించదగ్గ విషయమని అన్నారు. "ఉగ్రమూకలను అంతమొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా సంపూర్ణ మద్దతు ఇస్తామని మా నాయకుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు, యువనేత నారా లోకేశ్ అమరావతి పునర్నిర్మాణ ప్రారంభోత్సవ సభలో ప్రజల సమక్షంలోనే బహిరంగంగా ప్రకటించారు" అని ఆయన గుర్తు చేశారు. 'ఆపరేషన్ సింధూర్' పేరుతో ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేయడం గర్వకారణమని, ఇలాంటి సమయంలో కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా యావత్ భారతావని ప్రధాని మోదీ తీసుకునే నిర్ణయాలకు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. భారత సైన్యానికి దేశం మొత్తం అండగా నిలవాలని, సైనికులు ధైర్యంగా ఉగ్రవాదులను ఏరివేసి పౌరుల భద్రతను కాపాడాలని ఆకాంక్షించారు.

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ, అంతర్జాతీయ సమాజం మద్దతుతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడులు చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టడం హర్షణీయమని అన్నారు. "రాత్రి జరిగిన ఈ దాడితో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శక్తులు వణికిపోతున్నాయి. మన వైపు చూడాలంటేనే భయపడేలా ప్రధాని మోదీ చర్యలు తీసుకుంటున్నారు" అని ఆయన వ్యాఖ్యానించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని, ప్రపంచమంతా ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తోందని, అమాయక ప్రజల ప్రాణాలను బలిగొంటున్న ఉగ్రవాద ముఠాలను సమూలంగా తుదముట్టించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు చిరంజీవిరావు, పేరాబత్తుల రాజశేఖరం, మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు, శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తిబాబు, భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, టీడీపీ సీనియర్ నాయకుడు రమణ, బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్, గంటా గౌతమ్, వల్లూరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న దృఢమైన వైఖరికి టీడీపీ పూర్తి మద్దతు ఉంటుందని వారు పునరుద్ఘాటించారు.
TDP
Operation Sindhura
India-Pakistan
Terrorism
Narendra Modi
Chandrababu Naidu
Lokesh
Anti-Terrorism
Pulwama Attack
Indian Army

More Telugu News