ఆపరేషన్ సిందూర్.. జైషె స్థావరం అప్పుడు.. ఇప్పుడు (వీడియో విడుదల)

  • పహల్గామ్ దాడికి ప్రతీకారంగా "ఆపరేషన్ సిందూర్"
  • బహవల్‌పూర్‌లోని జైషే ప్రధాన స్థావరం ధ్వంసం
  • దాడి దృశ్యాలు విడుదల చేసిన అమిత్ మాలవీయ
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థల స్థావరాలపై 'ఆపరేషన్ సిందూర్' పేరిట మెరుపు దాడులు నిర్వహించి గట్టి షాక్ ఇచ్చింది. ఈ దాడుల్లో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాద ముఠాల శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యంగా పంజాబ్ ప్రావిన్స్‌లోని బహవల్‌పూర్‌లో ఉన్న జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం 'మర్కజ్ సుబాన్' ఈ దాడుల్లో ధ్వంసమైంది. ఈ దాడికి ముందు, తర్వాతి దృశ్యాలను బీజేపీ ఐటీ విభాగం ఇన్‌ఛార్జ్ అమిత్ మాలవీయ 'ఎక్స్' వేదికగా పంచుకున్నారు.

అమిత్ మాలవీయ విడుదల చేసిన వీడియోలో దాడులకు ముందు జైషే స్థావరం ఎలా ఉంది, దాడుల తర్వాత అది ఎలా ధ్వంసమైందో స్పష్టంగా కనిపిస్తోంది. భవనం గోడలు కూలిపోయి భారీ గొయ్యి ఏర్పడిన దృశ్యాలున్నాయి.

"పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని బహవల్‌పూర్‌లో గల మర్కజ్ సుబాన్.. జైషే ముఠా ప్రధాన కార్యాలయం. ఈ ఉగ్రశిబిరంలోనే జైషే అనేక ఉగ్ర కుట్రలకు పథక రచన చేసింది. 2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడికి కూడా ఇక్కడే ప్రణాళిక రచించారు. ఆ దాడికి పాల్పడిన వారికి ఇక్కడే శిక్షణ అందించారు. ఇప్పుడు ఆ స్థావరాన్ని ధ్వంసం చేశాం" అని మాలవీయ తన పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

ఈ బహవల్‌పూర్ స్థావరం జైషే చీఫ్ మసూద్ అజార్‌కు నివాసంగా కూడా ఉపయోగపడిందని, దాడుల్లో అతడి కుటుంబ సభ్యులు 10 మందితో పాటు నలుగురు కీలక అనుచరులు కూడా మరణించారు. జైషేలో ప్రస్తుతం నంబర్-2గా వ్యవహరిస్తున్న ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్, మౌలానా అమర్ వంటి వారి కుటుంబాలు కూడా ఇదే ప్రాంగణంలో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దాదాపు 600 మంది ఉగ్రవాదుల కుటుంబాలు కూడా ఈ క్యాంపస్‌లోనే ఆశ్రయం పొందుతున్నట్లు సమాచారం.


More Telugu News