ఆపరేషన్ సిందూర్ విజయవంతం, కేబినెట్‌కు వివరించిన ప్రధాని మోదీ

  • 'ఆపరేషన్ సిందూర్' పై కేబినెట్‌కు వివరించిన ప్రధాని మోదీ
  • సరిహద్దు ఆవల 9 ఉగ్రవాద శిబిరాలపై భారత దళాల దాడులు
  • పహల్గామ్ దాడికి ప్రతీకారంగా, ఉగ్ర నిర్మూలన లక్ష్యంగా చర్య
  • ప్రణాళిక ప్రకారమే ఆపరేషన్, తప్పులు లేవన్న ప్రధాని
భారత రక్షణ దళాలు చేపట్టిన "ఆపరేషన్ సిందూర్" వివరాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం కేంద్ర కేబినెట్‌కు తెలియజేశారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా బుధవారం తెల్లవారుజామున సరిహద్దు అవతల ఉన్న తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారత దళాలు లక్షిత దాడులు నిర్వహించాయి. ఈ దాడులు ముందుగా నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారమే, ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా విజయవంతంగా పూర్తయ్యాయని ప్రధాని కేబినెట్‌కు తెలిపారు.

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో 26 మంది పౌరుల మృతికి కారణమైన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా ఈ సైనిక చర్య చేపట్టినట్లు ప్రధాని వివరించారు. భారత త్రివిధ దళాలు (ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్) అత్యంత సమన్వయంతో ఈ ఆపరేషన్‌ను నిర్వహించాయని, సాయుధ బలగాల వృత్తి నైపుణ్యం, దేశ భద్రత పట్ల వారి నిబద్ధత ప్రశంసనీయమని మోదీ కొనియాడినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదంపై పోరులో ప్రధాని నాయకత్వానికి, సైన్యానికి కేబినెట్ మంత్రులు ఏకగ్రీవంగా మద్దతు పలికారు.

"ఆపరేషన్ సిందూర్" అనే సంకేత నామంతో జరిగిన ఈ దాడులను ప్రధాని మోదీ స్వయంగా పర్యవేక్షించారు. పహల్గామ్ దాడిలో భర్తలను కోల్పోయిన మహిళలకు నివాళిగా ఈ ఆపరేషన్‌కు ఆ పేరు పెట్టినట్లు తెలిసింది. 

బుధవారం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రితో కలిసి భారత సాయుధ దళాలకు చెందిన ఇద్దరు మహిళా అధికారులు, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. బుధవారం తెల్లవారుజామున 1:05 నుంచి 1:30 గంటల మధ్య విశ్వసనీయ నిఘా సమాచారం ఆధారంగా ఈ దాడులు జరిపినట్లు వారు వెల్లడించారు. సరిహద్దు ఆవలి ఉగ్రవాద మౌలిక సదుపాయాలు, ఉగ్రవాదులను ప్రవేశపెట్టే లాంచ్‌ప్యాడ్‌లు, శిక్షణా కేంద్రాలను ధ్వంసం చేయడమే ఈ ఆపరేషన్ ప్రధాన లక్ష్యమని వారు స్పష్టం చేశారు.


More Telugu News