సింధూ జలాల్లో రక్తం పారుతుందన్న బిలావల్ భుట్టో నోట 'శాంతి' మాట

  • భారత్‌తో శాంతి చర్చలకు పాకిస్థాన్ సుముఖంగా ఉందన్న బిలావల్ భుట్టో
  • శాంతి లేదా విధ్వంసం, భారత్ నిర్ణయించుకోవాలని వ్యాఖ్య
  • గతంలో ఉగ్రసంస్థలతో పాక్‌కు సంబంధాలున్నాయన్న అంగీకారం
పహల్గామ్ ఉగ్రదాడి, అనంతరం సింధూ జలాల ఒప్పందంపై భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాల నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) ఛైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో శాంతి చర్చలకు తమ దేశం సిద్ధంగా ఉందని ప్రకటిస్తూనే, విధ్వంసం లేదా శాంతిలో ఏదో ఒకటి తేల్చుకోవాల్సిందిగా భారత్‌కు అల్టిమేటం జారీ చేశారు.

పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో మాట్లాడుతూ, బిలావల్ భుట్టో భారత్‌తో చర్చల అంశాన్ని ప్రస్తావించారు. "భారత్ శాంతి మార్గాన్ని కోరుకుంటే, బిగించిన పిడికిలితో కాకుండా స్నేహ హస్తంతో ముందుకు రావాలి. కల్పితాలు కాకుండా వాస్తవాలతో చర్చలకు రావాలి. పొరుగు దేశంగా వారితో కూర్చుని వాస్తవాలు మాట్లాడుకుందాం" అని ఆయన అన్నారు. అయితే, ఇదే సమయంలో, "ఒకవేళ అలా కాదనుకుంటే, పాకిస్థాన్ ప్రజలను ఎవరూ మోకరిల్లేలా చేయలేరని గుర్తుంచుకోవాలి. పాక్ ప్రజలు పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. ఇది యుద్ధంపై మక్కువతో కాదు. స్వేచ్ఛపై ప్రేమతో మాత్రమే" అంటూ హెచ్చరిక ధోరణిలో వ్యాఖ్యానించారు. ఇటీవల సింధూ నదీ జలాల విషయంలో "నీరు పారకపోతే రక్తం పారుతుంది" అంటూ బిలావల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఉగ్రవాదంపై అంగీకారం, గత చరిత్రగా అభివర్ణన

ఇటీవల పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, ఉగ్రవాద సంస్థలకు పాక్ మద్దతు ఇచ్చిందని, ఆర్థిక సాయం అందించిందని చేసిన వ్యాఖ్యలతో బిలావల్ భుట్టో ఏకీభవించారు. ఉగ్రవాద సంస్థలతో పాకిస్థాన్‌కు గతంలో సంబంధాలున్నది నిజమేనని ఆయన అంగీకరించారు. అయితే, అది ఒక 'ముగిసిన అధ్యాయం' అని, తమ చరిత్రలో అదొక 'దురదృష్టకరమైన భాగం' అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉగ్రవాదం వల్ల పాకిస్థాన్ బాధితురాలిగా మారిందని, తాము ఉగ్రవాదాన్ని ఎన్నడూ ప్రోత్సహించలేదని ఆయన తెలిపారు.


More Telugu News