ఆర్‌సీబీతో అనుబంధం, కెప్టెన్సీ వీడ్కోలుపై మనసు విప్పిన విరాట్ కోహ్లీ

  • కెప్టెన్సీ వల్ల తీవ్ర ఒత్తిడికి లోనయ్యానన్న విరాట్ కోహ్లీ
  • కెరీర్ పీక్స్‌లో ఇతర జట్లలోకి వెళ్లే అవకాశాలు వచ్చినా తిరస్కరించిన వైనం
  • ప్రశాంతంగా క్రికెట్ ఆడేందుకే సారథ్య బాధ్యతల నుంచి వైదొలగినట్లు వెల్లడి
  • కెరీర్ ఆరంభంలో ధోనీ, కిర్‌స్టెన్ తనకు అండగా నిలిచారని గుర్తుచేసుకున్న కోహ్లీ
టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన కెరీర్‌కు సంబంధించిన పలు కీలక విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టుతో తనకున్న సుదీర్ఘ అనుబంధం, కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందనే దానిపై తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అపారమైన ఒత్తిడి, నిరంతర పరిశీలన కారణంగానే సారథ్యం నుంచి వైదొలిగానని, ప్రశాంతంగా క్రికెట్‌ ఆస్వాదించడానికే ఈ నిర్ణయం తీసుకున్నానని కోహ్లీ స్పష్టం చేశాడు.

భారత జట్టుకు సుదీర్ఘకాలం కెప్టెన్‌గా వ్యవహరించడంతో పాటు, ఐపీఎల్‌లో ఆర్‌సీబీ జట్టుకు కూడా దాదాపు తొమ్మిదేళ్ల పాటు సారథ్యం వహించడం వల్ల తనపై తీవ్ర ఒత్తిడి ఉండేదని విరాట్ కోహ్లీ తెలిపాడు. "ఒకానొక సమయంలో నాపై ఒత్తిడి బాగా పెరిగిపోయింది. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా ప్రతి మ్యాచ్‌లోనూ నా నుంచి ఎన్నో అంచనాలు ఉండేవి. ఈ నిరంతర పరిశీలన, అంచనాల భారం చివరికి చాలా కష్టంగా మారింది. అందుకే, ప్రశాంతంగా, ఎలాంటి అంచనాలు, తీర్పులు లేకుండా నా ఆటను నేను ఆస్వాదించడానికి కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను" అని కోహ్లీ పేర్కొన్నాడు.

తన కెరీర్‌లో 2016 నుంచి 2019 మధ్య కాలంలో, తాను అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నప్పుడు ఇతర ఐపీఎల్ జట్ల నుంచి ఆఫర్లు వచ్చాయని, జట్టు మారమని పలువురు సూచించారని కోహ్లీ గుర్తుచేసుకున్నాడు. అయినప్పటికీ, ఆర్‌సీబీ యాజమాన్యంతో ఉన్న సంబంధం, పరస్పర గౌరవం, ముఖ్యంగా అభిమానుల నుంచి లభించిన అపారమైన ప్రేమ కారణంగానే తాను జట్టును వీడలేదని ఉద్ఘాటించాడు. "అభిమానుల నుంచి నేను పొందిన ప్రేమ ముందు ఏ ట్రోఫీ కూడా సాటిరాదు. ఆ ప్రేమ నా జీవితాంతం నాతో ఉంటుంది" అని కోహ్లీ భావోద్వేగంగా అన్నాడు.

తన అంతర్జాతీయ కెరీర్ ఆరంభంలో అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ తనకు ఎంతగానో అండగా నిలిచారని కోహ్లీ తెలిపాడు. "నా సామర్థ్యంపై నాకు పూర్తి అవగాహన ఉండేది. అయితే, నాలోని పట్టుదల, జట్టును గెలిపించాలనే తపనను ధోనీ, కిర్‌స్టెన్ గుర్తించారు. వారు నన్ను నమ్మి, నం.3 స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం కల్పించారు. మైదానంలో నా దూకుడుతనం, శక్తిసామర్థ్యాలే జట్టుకు విలువైనవని వారు నాతో చెప్పేవారు" అని కోహ్లీ నాటి రోజులను గుర్తుచేసుకున్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా, అభిమానుల ఆదరాభిమానాలే తనకు అన్నింటికంటే ముఖ్యమని కోహ్లీ తన మనసులోని మాటను పంచుకున్నాడు.


More Telugu News