Pawan Kalyan: పవన్ పై వ్యాఖ్యలు చేసిన ప్రకాశ్ రాజ్ కు విష్ణువర్దన్ రెడ్డి కౌంటర్

- తమిళనాడు మత్స్యకారుల అంశంలో పవన్ స్పందన
- పవన్ కు ఇతర రాష్ట్రాల విషయాలు అవసరమా అంటూ ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు
- పవన్ ను విమర్శిస్తూ వార్తల్లో ఉండడం తప్ప ప్రకాశ్ రాజ్ సాధించిందేమీ లేదన్న విష్ణు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ముందుగా తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంపై దృష్టి కేంద్రీకరించాలని, ఆ తర్వాతే ఇతర రాష్ట్రాల వ్యవహారాల గురించి ఆలోచించాలని పవన్ కల్యాణ్ కు సూచించారు.
"ముందు మీ నియోజకవర్గం చూసుకోండి. మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాల రాజకీయాలు, అక్కడి సమస్యల గురించి ఆలోచించడం ఇప్పుడు అంత అవసరమా?" అని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. తమిళనాడు మత్స్యకారుల అంశంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ ఈ విధంగా స్పందించినట్టు తెలుస్తోంది.
అయితే, ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలకు ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్‌పై విమర్శలతో వార్తల్లో ఉండటం మినహా, ప్రకాశ్ రాజ్ రాజకీయంగా సాధించిందేమీ లేదని ఎద్దేవా చేశారు.
బీజేపీని నిత్యం విమర్శించడమే ప్రకాశ్ రాజ్ పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. "పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి, ప్రజల మద్దతుతో ఉప ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు. మీరు కూడా రాజకీయాల్లోకి వచ్చారు, గతంలో ఎంపీగా పోటీ చేశారు. మరి మీరేమి సాధించారు?" అని ప్రకాశ్ రాజ్‌ను ప్రశ్నించారు.