Rahul Gandhi: 1984 అల్లర్లపై రాహుల్ గాంధీ ఏమన్నారంటే..?

- అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీ కార్యక్రమంలో రాహుల్ కు సిక్కు యువకుడి ప్రశ్న
- ఈ అల్లర్ల నిందితుడు సజ్జన్ కుమార్ పై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోలేదేమని నిలదీత
- అప్పట్లో జరిగింది తప్పేనని తాను చాలాసార్లు చెప్పానన్న రాహుల్ గాంధీ
- ఆ తప్పులు జరిగినప్పుడు తాను లేనని, అయినా బాధ్యత తీసుకుంటానని వెల్లడి
భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య అనంతరం చోటుచేసుకున్న పరిణామాలపై ఓ సిక్కు యువకుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని నిలదీశారు. అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో రాహుల్ ను నేరుగా ప్రశ్నించారు. సిక్కు వ్యతిరేక అల్లర్లపై, అల్లర్ల కేసులో దోషిగా తేలిన సజ్జన్ కుమార్ వంటి నేతలపై కాంగ్రెస్ పార్టీ ఏం చర్యలు తీసుకుందని అడిగారు. సజ్జన్ కుమార్ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నాడని గుర్తుచేశారు. భారత దేశంలో బీజేపీ ప్రభుత్వం వల్ల సిక్కులు భయపడుతూ బతకాల్సి వస్తోందని, తలపై టర్బన్ ధరించకుండా చట్టాలు చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని రాహుల్ చెప్పిన విషయాన్ని ఆ విద్యార్థి గుర్తుచేశాడు.
తలపాగా ధరించడం, కడా వేసుకోవడం, గురుద్వారాకు వెళ్లడం మాత్రమే కాదు సిక్కులకు భావప్రకటనా స్వేచ్ఛ కావాలని అన్నాడు. కాంగ్రెస్ పాలనలో అది లభించలేదని ఆరోపించాడు. ఇప్పటికీ కాంగ్రెస్ అగ్ర నేత అయిన మీరు (రాహుల్ గాంధీ) సిక్కులతో సయోధ్య కుదుర్చుకోలేదన్నాడు. బీజేపీ పాలన గురించి మీరు భయపెడుతున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ సజ్జన్ కుమార్ లాంటి నేతలను వెనకేసుకు వస్తోందని విమర్శించాడు. పాకిస్థాన్ లోని ఆనంద్ పూర్ సాహిబ్ ను సిక్కులు దర్శించుకునే వీలు కల్పించేందుకు బీజేపీ సర్కారు ఓ తీర్మానం చేయగా.. కాంగ్రెస్ పార్టీ దానిని వేర్పాటువాద పత్రంగా అభివర్ణించిందని గుర్తుచేశాడు. కాంగ్రెస్ పార్టీ తీరు ఇలాగే ఉంటే బీజేపీ పంజాబ్ లోకి కూడా ప్రవేశిస్తుందని ఆ యువకుడు తేల్చిచెప్పారు.
సిక్కు యువకుడి ప్రశ్నలకు రాహుల్ గాంధీ జవాబిస్తూ.. 1980లలో భారత్ లో జరిగింది తప్పేనని తాను చాలాసార్లు బహిరంగంగానే చెప్పానని వివరించారు. కాంగ్రెస్ పార్టీ గతంలో చాలా తప్పులు చేసిందని అంగీకరిస్తూనే ఆ సమయాలలో తాను లేననే విషయం గుర్తుచేశారు. అయినప్పటికీ, కాంగ్రెస్ చరిత్రలో చేసిన ప్రతి తప్పుకు తాను బాధ్యత వహించడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయాన్ని చాలాసార్లు సందర్శించానని రాహుల్ తెలిపారు. అదేవిధంగా సిక్కులతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాగా, బ్రౌన్ యూనివర్సిటీలో జరిగిన ఈ ప్రశ్నోత్తరాలపై బీజేపీ నేత అమిత్ మాలవీయ స్పందిస్తూ.. రాహుల్ గాంధీ కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నవ్వులపాలవుతున్నారని వ్యాఖ్యానించారు.