పాకిస్థాన్‌కు వెళ్లడంపై శ్రీనగర్‌లోని ఒక కుటుంబానికి తాత్కాలిక ఊరట!

  • పహల్గామ్ ఘటన తర్వాత పాకిస్థాన్ జాతీయల వీసాలు రద్దు
  • తమను పాక్‌కు పంపించకుండా చూడాలంటూ సుప్రీంకోర్టుకు వెళ్లిన ఓ కుటుంబం
  • సుప్రీంకోర్టులో లభించిన తాత్కాలిక ఊరట
  • పత్రాలు పరిశీలించే వరకు చర్యలు వద్దని అధికారులకు సూచన
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లోని పాకిస్థాన్ జాతీయులు స్వదేశాలకు వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే, శ్రీనగర్‌కు చెందిన ఓ కుటుంబానికి సుప్రీంకోర్టు శుక్రవారం తాత్కాలిక ఊరటనిచ్చింది. వారి పిటిషన్‌ను కొట్టివేసినప్పటికీ, సంబంధిత పత్రాలను పరిశీలించి సరైన నిర్ణయం తీసుకునే వరకు ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని అధికారులను ఆదేశించింది.

ఇదీ నేపథ్యం

వివరాల్లోకి వెళితే, పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు పాకిస్థాన్ జాతీయుల వీసాలు రద్దయ్యాయి. దీంతో శ్రీనగర్‌కు చెందిన అహ్మద్ తారిక్ భట్ కుటుంబం దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆరుగురు సభ్యులున్న ఈ కుటుంబం వీసా గడువు ముగిసినా భారత్‌లోనే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కుటుంబం శ్రీనగర్‌లో నివసిస్తుండగా, వారి కుమారుడు బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నారు.

భారత్ పాకిస్థాన్ జాతీయుల వీసాలను రద్దు చేసిన నేపథ్యంలో, తమను పాకిస్థాన్‌కు పంపకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తారిక్ భట్ కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కె. సింగ్ ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది నంద కిశోర్ వాదనలు వినిపిస్తూ, "వారు భారత పౌరులే, వారి వద్ద ఆధార్, పాన్, ఓటర్ ఐడీ వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డులున్నాయి. అయినప్పటికీ వారిని అరెస్టు చేశారు" అని కోర్టుకు తెలిపారు. కుటుంబ సభ్యుల్లో ఒకరు పాకిస్థాన్‌లో జన్మించినప్పటికీ, తర్వాత భారత్‌కు వలస వచ్చి పాక్ పాస్‌పోర్ట్‌ను అధికారులకు సరెండర్ చేశారని న్యాయవాది వివరించారు.

వాదనలు విన్న ధర్మాసనం, పిటిషన్ దాఖలు చేయడంలో కొన్ని లోపాలున్నాయని పేర్కొంది. "ఈ కేసు మెరిట్స్‌పై మేం ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేయడం లేదు. పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం" అని స్పష్టం చేసింది. అయితే, ఈ కేసులోని ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని అధికారులకు కీలక సూచనలు చేసింది.

"ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు, కుటుంబ సభ్యులు సమర్పిస్తున్న పత్రాలను, మీ దృష్టికి తెచ్చే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించండి. తుది నిర్ణయం వెలువడే వరకు వారిపై ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దు" అని ధర్మాసనం ఆదేశించింది. 

అధికారుల నిర్ణయంపై అసంతృప్తి ఉంటే, పిటిషనర్లు జమ్ముకశ్మీర్ హైకోర్టును సంప్రదించవచ్చని సూచించింది. కేసులోని వాస్తవాలను నిర్ధారించే అధికారం హైకోర్టుకు ఉందని కూడా బెంచ్ తెలియజేసింది. ఈ రూలింగ్‌ను ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా మినహాయింపుగా పరిగణించాలని, ఇతర కేసులకు ఉదాహరణగా తీసుకోరాదని ధర్మాసనం స్పష్టం చేసింది.

పిటిషనర్లు సంబంధిత అధికార యంత్రాంగాన్ని సంప్రదించడం సరైన మార్గమని కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.


More Telugu News