ఏపీ లిక్కర్ స్కామ్... ప్రారంభమైన రాజ్ కసిరెడ్డి వారం రోజుల సిట్ విచారణ

  • రాజ్ కసిరెడ్డిని సిట్ కస్టడీకి అనుమతించిన ఏసీబీ కోర్టు
  • విజయవాడ సిట్ కార్యాలయంలో కొనసాగుతున్న దర్యాప్తు
  • జగన్ సన్నిహితుడిగా రాజ్ కు గుర్తింపు
ఏపీ లిక్కర్ స్కాం కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. వారం రోజుల పాటు కసిరెడ్డిని విచారించేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు నిన్న అనుమతినిచ్చిన నేపథ్యంలో, సిట్ అధికారులు ఈ ఉదయం ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. రాజ్ కసిరెడ్డి వైసీపీ అధినేత జగన్ కు సన్నిహితుడని ప్రచారంలో ఉంది.

విజయవాడ జిల్లా జైలులో ఉన్న కసిరెడ్డిని సిట్ అధికారులు ముందుగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం, పూర్తిస్థాయి విచారణ నిమిత్తం ఆయన్ను సిట్ కార్యాలయానికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన విచారణ కొనసాగుతోంది. కోర్టు ఆదేశాల ప్రకారం, వారం రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కసిరెడ్డిని విచారించి, తిరిగి జిల్లా జైలుకు అప్పగించనున్నారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానం రూపకల్పన నుంచి, డిస్టిలరీలకు అనుమతులు, నెలవారీ మామూళ్ల వరకు మొత్తం వ్యవహారం కసిరెడ్డి కనుసన్నల్లోనే నడిచిందని, ఈ క్రమంలో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని సిట్ అధికారులు ఇప్పటికే ప్రాథమికంగా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే, కేసు లోతుపాతులను వెలికితీసేందుకు కసిరెడ్డిని పది రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ అనంతరం, కోర్టు వారం రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ కుంభకోణం వెనుక ఎవరెవరు ఉన్నారు, ఎవరి ఆదేశాలతో ఈ వ్యవహారాలు నడిచాయనే కోణంలో సిట్ అధికారులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల పాత్రపై కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగానే ఈ వ్యవహారం నడిచిందన్న ఆరోపణల నేపథ్యంలో, నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలు, పాత్రపై సిట్ దృష్టి సారించినట్లు సమాచారం.


More Telugu News