ముంబయి ఇండియన్స్ తో రాజస్థాన్ రాయల్స్ ఢీ... అందరి దృష్టి అతడిపైనే!

  • ఐపీఎల్ లో నేడు ఆసక్తికర మ్యాచ్
  • ముంబయి ఇండియన్స్ పై టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్
  • సొంతగడ్డపై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టు
  • జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో మ్యాచ్
  • సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా వైభవ్ సూర్యవంశి
ఐపీఎల్ లో ఒకే ఒక్క ఇన్నింగ్స్ తో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశి స్టార్ అయిపోయాడు. ఈ లీగ్ లో తన మూడో మ్యాచ్ లోనే 35 బంతుల్లో 100 పరుగులు చేసి రికార్డుల మోత మోగించాడీ బీహార్ బాలుడు. ఐపీఎల్ లో వైభవ్ సూర్యవంశి రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 

ఇవాళ రాజస్థాన్ జట్టు ముంబయి ఇండియన్స్ జట్టుతో తలపడుతోంది. ఈ మ్యాచ్ లో అందరి దృష్టి చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశిపైనే ఉంటుందనడంలో సందేహం లేదు. అయితే, ముంబయిలో ఇండియన్స్ జట్టులో జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా వంటి హేమాహేమీ బౌలర్లను ఎదుర్కొని అతడు ఎంతమేరకు రాణించగలడన్నది సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. 

మ్యాచ్ విషయానికొస్తే... జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరుగుతోంది. సొంతగడ్డపై టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. లీగ్ లో ప్లేఆఫ్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే రాజస్థాన్ రాయల్స్ కు ఈ మ్యాచ్ లో నెగ్గడం తప్పనిసరి. 

ఈ మ్యాచ్ కోసం రాజస్థాన్ టీమ్ లో రెండు మార్పులు చేశారు. హసరంగ స్థానంలో కుమార్ కార్తికేయ... సందీప్ శర్మ స్థానంలో మధ్వాల్ తుదిజట్టుకు ఎంపికయ్యారు. అటు, ముంబయి ఇండియన్స్ టీమ్ లో ఎలాంటి మార్పులు లేవని కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెల్లడించాడు. 

పాయింట్ల పట్టిక చూస్తే... ముంబయి ఇండియన్స్ 10 మ్యాచ్ లు ఆడి 6 విజయాలతో మూడో స్థానంలో కొనసాగుతోంది. రాజస్థాన్ రాయల్స్ 10 మ్యాచ్ లు ఆడి కేవలం 3 విజయాలు మాత్రమే సాధించి ఎనిమిదో స్థానంలో ఉంది.


More Telugu News