పంజాబ్ కింగ్స్‌కు భారీ ఎదురుదెబ్బ.. ఐపీఎల్ నుంచి స్టార్ ఆల్‌రౌండర్ అవుట్!

  • ప్రాక్టీస్‌లో మ్యాక్సీ వేలికి గాయం
  • స్కానింగ్‌లో వేలు విరిగినట్టు నిర్ధారణ
  • చెన్నైతో మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ స్థానంలో ఆడిన సూర్యాంశ్ షెడ్జ్
  • ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నామన్న కోచ్ రికీ పాంటింగ్
ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఐపీఎల్‌లోని మిగతా మ్యాచ్‌ల నుంచి తప్పుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేలు విరిగినట్టు నిర్ధారణ కావడంతో సీజన్ మధ్యలోనే టోర్నీకి గుడ్‌బై చెప్పే పరిస్థితి ఏర్పడింది. వర్షం కారణంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరగాల్సిన మ్యాచ్ రద్దయిన సంగతి తెలిసిందే. అంతకుముందు ప్రాక్టీస్ సమయంలో మ్యాక్స్‌వెల్ వేలికి గాయమైంది. ఆ మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ ఏడు పరుగులకే అవుటయ్యాడు. గత రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడి స్థానంలో సూర్యాంశ్ షెడ్జ్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

పంజాబ్ కింగ్స్ ఆటగాడు, మ్యాక్స్‌వెల్ స్నేహితుడు అయిన మార్కస్ స్టోయినిస్ మాట్లాడుతూ.. మ్యాక్సీ వేలికి గాయమైందని, మొదట ఇదేమీ పెద్ద గాయం కాదని అనుకున్నామని చెప్పాడు. అయితే, స్కానింగ్‌లో అసలు విషయం బయటపడిందన్నాడు. దీంతో అతడు టోర్నీ మొత్తం దూరమయ్యే అవకాశం కనిపిస్తోందని చెప్పుకొచ్చాడు.

పంజాబ్ జట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్ మాట్లాడుతూ.. ప్రత్యామ్నాయ ఆటగాళ్ల కోసం చూస్తున్నట్టు చెప్పాడు. ఇప్పటికే జట్టులో ఉన్న ప్లేయర్లను ఉపయోగించే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు చెప్పాడు. అజ్మతుల్లా ఉమర్‌జాయ్, ఆరోన్ హార్డీ, జేవియర్ బార్ట్‌లెట్ వంటి ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని యోచిస్తున్నట్టు చెప్పాడు. ధర్మశాలలో మైదాన పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. అంతర్జాతీయ లీగ్‌లు కొనసాగుతున్న నేపథ్యంలో విదేశీ ఆటగాళ్లను నేరుగా తీసుకోవడం అంత సులభం కాదని పాంటింగ్ పేర్కొన్నాడు. తాము భారతీయ యువ ప్రతిభను కూడా పరిశీలిస్తున్నామని, కొంతమంది ఆటగాళ్లు ధర్మశాలకు కూడా వస్తున్నారని తెలిపాడు. వారిలో ఒకరికి పంజాబ్ కాంట్రాక్ట్ లభించే అవకాశం ఉందని పాంటింగ్ వివరించాడు.


More Telugu News