11 ఏళ్ల విద్యార్థితో లేడీ టీచర్ పరార్.. రాజస్థాన్ సరిహద్దులో పట్టివేత

  • గుజరాత్‌లోని సూరత్‌లో ఘటన
  • నాలుగేళ్లుగా టీచర్ వద్దకు ట్యూషన్‌కు బాలుడు
  • ఏడాది నుంచి వారి మధ్య పెరిగిన అనుబంధం
  • పెళ్లి చేసుకోవాలని యువతిపై, చదువు విషయంలో బాలుడిపై ఒత్తిడి
  • భరించలేక ఇంటి నుంచి వెళ్లిపోవాలని ప్లాన్
  • నాలుగు రోజుల తర్వాత 390 కిలోమీటర్ల దూరంలో బస్సులో పట్టివేత
గుజరాత్‌లోని సూరత్‌లో జరిగిన ఓ ఘటన అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. 23 ఏళ్ల లేడీ టీచర్ 11 ఏళ్ల తన స్టూడెంట్‌తో కలిసి పరారైంది. ఆమె తన ఫోన్‌ను స్విచ్చాఫ్ చేసుకున్నా.. రెండో నంబర్ యాక్టివ్‌గా ఉండటంతో దాని ద్వారా వారిని నాలుగు రోజుల తర్వాత 390 కిలోమీటర్ల దూరంలో పట్టుకున్నారు. మంచి ఉపాధ్యాయురాలిగా పేరు సంపాదించుకున్న యువతి ఏప్రిల్ 25న బాలుడితో పరారైంది. ఇళ్లలో కుటుంబ సభ్యుల ఒత్తడి, తిట్లు పడలేకే వీరిద్దరూ వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది.

ఫోన్ స్విచ్చాఫ్
బాలుడితో పరారైన వెంటనే టీచర్ తన ప్రధాన మొబైల్‌ ఫోన్‌ను ఆఫ్ చేసుకోవడంతో వారిని పట్టుకోవడం పోలీసులకు కష్టంగా మారింది. దీంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు గాలించారు. సీసీటీవీలు జల్లెడ పట్టారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. అయితే, టీచర్ రహస్యంగా వాడుతున్న రెండో ఫోన్ నంబర్ యాక్టివ్‌గా ఉండటంతో పోలీసుల పని సులభమైంది. 

రాజస్థాన్ సరిహద్దులో పట్టివేత
టీచర్, విద్యార్థి కోసం సూరత్‌లోని పూణె పోలీసులు నలుగురు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో రాజస్థాన్ సరిహద్దులో షామ్లాజీ సమీపంలోని ఓ బస్సులో వీరిని పట్టుకున్నారు. దీంతో నాలుగు రోజుల వేటకు ఫుల్‌స్టాప్ పడింది. సూరత్ నుంచి వారు బస్సులో 390 కిలోమీటర్లు ప్రయాణించడం గమనార్హం. 

మూడేళ్లుగా పరిచయం
టీచర్‌కు, బాలుడికి మధ్య మూడేళ్లుగా పరిచయం ఉంది. ఇరు కుటుంబాల మధ్య స్నేహం కూడా ఉంది. సూరత్‌లోని పూణెలో ఉండే ఓ కిరాణా వ్యాపారి కుమారుడైన బాలుడు 5వ తరగతి చదువుతున్నాడు. ఆమె వద్దకు ట్యూషన్‌కు వెళ్తుండేవాడు. ఏడాది కాలంగా ఆమె వద్ద ఒక్కడే చదువుకుంటున్నాడు. ఇది ఇద్దరి మధ్య అనుబంధానికి కారణమైంది. మరోవైపు, పెళ్లి చేసుకోవాలని కుటుంబం నుంచి టీచర్‌కు ఒత్తిడి పెరిగింది. ఇంకోవైపు, బాలుడి చదువు విషయంలో కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు. దీంతో ఇద్దరూ కలిసి పారిపోవాలని నిర్ణయించుకున్నారు. పక్కా ప్రణాళికతో ఇద్దరూ వెళ్లిపోయారు. విషయం వెలుగులోకి రావడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. దర్యాప్తు కొనసాగుతోంది.


More Telugu News