రిమాండ్ ఖైదీని జైలులో పెళ్లి చేసుకున్న అత్యాచార బాధితురాలు

  • ఒడిశాలోని గోచాబాదిలో ఘటన
  • పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై నిందితుడి అత్యాచారం
  • ఆరు నెలలుగా రిమాండ్ ఖైదీగా జైలులో నిందితుడు 
  • కోర్టు అంగీకారంతో జైలు ప్రాంగణంలో వివాహం
లైంగికదాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ దాదాపు ఆరు నెలలుగా జైలులో విచారణ ఖైదీగా ఉన్న నిందితుడిని.. అతడిపై కేసు పెట్టిన యువతి జైలు ప్రాంగణంలోనే వివాహం చేసుకుంది. ఒడిశాలో జరిగిందీ ఘటన. జైలు అధికారుల కథనం ప్రకారం గోచాబాదికి చెందిన సూర్యకాంత్ బెహరా తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడంటూ 22 ఏళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

గతేడాది నవంబర్‌లో సూర్యకాంత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అప్పటి నుంచి అతడు కొడాలా సబ్ జైలులో విచారణ ఖైదీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఈ కేసును సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ఇరు కుటుంబాల మధ్య చర్చలు జరిగాయి. ఈ క్రమంలో నిందితుడు, బాధిత యువతి ఇద్దరూ పెళ్లికి అంగీకరించినట్టు వారు కోర్టులో పిటిషన్ వేశారు. పరిశీలించిన న్యాయస్థానం వారి వివాహానికి అంగీకరించింది. దీంతో కొడాలా సబ్ జైలులో అధికారులు వారిద్దరికీ హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిపించారు. అయినప్పటికీ తుదితీర్పు వెలువడే వరకు సూర్యకాంత్ జైలులోనే ఉండనున్నాడు.


More Telugu News