సల్మాన్ వ్యాఖ్యలను మనం తప్పుగా అర్ధం చేసుకున్నామేమో: నాని

  • సౌత్ ఆడియన్స్‌పై సల్మాన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన వైనం
  • సల్మాన్ వ్యాఖ్యలను తోసిపుచ్చిన హీరో నాని
  • సౌత్ చిత్రాల కంటే ముందే హిందీ చిత్రాలను దక్షిణాది ప్రేక్షకులు ఆదరిస్తున్నారన్న నాని
దేశమంతటా హిందీ చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందని, సల్మాన్ ఖాన్‌కు ఇక్కడ (దక్షిణ భారతదేశం) భారీ అభిమానగణం ఉందని నేచురల్ స్టార్ నాని అన్నారు. దక్షిణాది ప్రేక్షకుల గురించి ఓ వేడుకలో సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.

'సికందర్' మూవీ ప్రచారంలో పాల్గొన్న సల్మాన్.. దక్షిణాది అభిమానులు తాను రోడ్లపై కనిపిస్తే 'భాయ్ భాయ్' అంటూ ప్రేమ చూపిస్తారని, కానీ ఆ ప్రేమ థియేటర్లలో ఉండదని అన్నారు. సల్మాన్ చేసిన ఈ వ్యాఖ్యలను నాని తోసిపుచ్చారు. దక్షిణాది సినిమాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నాయని, అయితే వీటికంటే ముందే హిందీ చిత్రాలను మనం ఆదరిస్తున్నామని అన్నారు. ఎన్నో దశాబ్దాల నుంచి బాలీవుడ్ సినిమాలపై మనం (దక్షిణాది) ఆదరాభిమానాలు చూపిస్తున్నామని పేర్కొన్నారు.

అమితాబ్ నటించిన ఎన్నో సినిమాలు దక్షిణాదిన అద్భుతమైన విజయాలు అందుకున్నాయని నాని గుర్తు చేశారు. అలాగే 'కుచ్ కుచ్ హోతా హై', 'దిల్ తో పాగల్ హై' వంటి చిత్రాలు దక్షిణాది ప్రేక్షకులకు ఎన్నో మంచి జ్ఞాపకాలు ఇచ్చాయని నాని పేర్కొన్నారు. సల్మాన్ నటించిన 'హమ్ ఆప్కే హై కౌన్' చిత్రం తనకు ఎంతో ఇష్టమని, అందులోని 'దీదీ తేరా దీవానా' పాట ప్రతి పెళ్లిలోనూ వినిపిస్తుందని గుర్తు చేశారు. బహుశా సల్మాన్ వ్యాఖ్యలను మనం తప్పుగా అర్థం చేసుకున్నామేమో అని నాని అన్నారు. 


More Telugu News