మీ మోదీకి అది కూడా చేతకావడం లేదు: పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడిన చామల కిరణ్ కుమార్ రెడ్డి

  • ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి తీవ్ర స్పందన
  • కాంగ్రెస్‌పై విమర్శలు మోదీని ప్రసన్నం చేసుకోవడానికేనని ఆరోపణ
  • ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం తగదని, హోదాకు తగ్గట్లు మాట్లాడాలని సూచన
  • కశ్మీర్ ఉగ్రదాడి ఘటనలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించాలని డిమాండ్
  • కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని, దేశాన్ని కాపాడిందని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ నాయకులకు పాకిస్తాన్‌పై ప్రేమ ఉంటే అక్కడికే వెళ్లిపోవాలంటూ పవన్ కళ్యాణ్ చేసినట్లుగా వచ్చిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. మీ మోదీకి నలుగురు ఉగ్రవాదులను పట్టుకోవడం చేతకావడం లేదని చామల విమర్శించారు.

ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను పవన్ కల్యాణ్ చదువుతున్నారని, 140 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీపై ఇటువంటి దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటని ఆయన అన్నారు. ఉప ముఖ్యమంత్రి అయ్యాక నాయకులు మరింత ఆలోచించి, బాధ్యతాయుతంగా మాట్లాడాలని హితవు పలికారు. "ప్రజలు గమనిస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి స్థాయికి తగినట్లుగా వ్యవహరించాలి" అని చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ అని, భారతదేశాన్ని కాపాడే పార్టీ అని చామల అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే, ఢిల్లీలోని ప్రధాని నివాసానికి వెళ్లి కలవాలని, లేదంటే రాజకీయాలు వదిలేసి రెండు సినిమాలు తీసి మోదీని మెప్పించాలని పవన్ కల్యాణ్‌కు హితవు పలికారు. తమ పార్టీ కార్యకర్తల, ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ఇష్టానుసారం మాట్లాడటం సరికాదని ఆయన అన్నారు. తాము కులమతాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలు చేయబోమని ఆయన స్పష్టం చేశారు.

ఇటీవల కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడుల ఘటనను ప్రస్తావిస్తూ, నలుగురు ఉగ్రవాదులు వచ్చి 26 మందిని పొట్టన పెట్టుకుంటే వారం రోజులు గడుస్తున్నా వారిని ఎందుకు అరెస్టు చేయలేకపోయారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి పవన్‌ కల్యాణ్‌కు సూచించారు.

"ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యమా? నిఘా వైఫల్యమా? కశ్మీర్‌లో ఆర్టికల్ 370 తెచ్చి ప్రశాంత వాతావరణం నెలకొల్పామని చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీయే దీనికి సమాధానం చెప్పాలి. దేశ సరిహద్దులో నుంచి 100 కిలోమీటర్ల లోపలికి చొరబడి ప్రజలను కాల్చి చంపిన నలుగురు ఉగ్రవాదులను పట్టుకోవడం చేతకాదు మీ మోదీకి" అని ఆయన అన్నారు. అసలు నిలదీయాల్సింది కేంద్ర ప్రభుత్వాన్ని అని, అంతేకానీ పిట్టకథలు చెప్పడం సరికాదని ఆయన విమర్శించారు.


More Telugu News