చైనాలో ఓ రెస్టారెంట్ లో అగ్నిప్రమాదం... 22 మంది మృతి

  • చైనాలోని లియావోయాంగ్‌ నగరంలో రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం
  • ఈ నెలలో చైనాలో ఇది రెండో పెద్ద అగ్నిప్రమాద ఘటన
  • ఇటీవల ఓ నర్సింగ్ హోంలో అగ్నిప్రమాదం... 20 మంది వృద్ధుల మృతి
చైనాలో మరో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లియావోయాంగ్‌ నగరంలోని ఓ రెస్టారెంట్‌లో మంగళవారం మధ్యాహ్నం చెలరేగిన భారీ అగ్నికీలలు 22 మందిని బలిగొన్నాయి. మరో ముగ్గురు ఈ దుర్ఘటనలో గాయపడ్డారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

ప్రమాద సమయంలో రెస్టారెంట్ భవనం నుంచి దట్టమైన పొగ, మంటలు ఎగిసిపడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. రెండు, మూడు అంతస్తుల భవనంలో మంటలు వేగంగా వ్యాపించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హుటాహుటీన సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అయితే, అగ్నిప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.

కాగా, ఈ నెలలో చైనాలో ఇంతటి ఘోర అగ్నిప్రమాదం జరగడం ఇది రెండోసారి. ఏప్రిల్ 9వ తేదీన చెంగ్డే నగరంలోని లాంగ్‌హువా కౌంటీలో ఉన్న ఒక నర్సింగ్ హోమ్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంలో 20 మంది వృద్ధులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ దుర్ఘటన జరిగినప్పుడు సదరు హోమ్‌లో సుమారు 260 మంది వృద్ధులు ఉన్నట్లు సమాచారం. 


More Telugu News