Military Aircraft Accident: 476 కోట్ల విలువైన విమానం సముద్రంలో పడిపోయింది.. అమెరికాలో ఘటన

- ఎర్ర సముద్రంలో నౌక పైనుంచి జారి సముద్రంలో పడ్డ యూఎస్ నేవీ ఫైటర్ జెట్
- యూఎస్ఎస్ హ్యారీ ఎస్ ట్రూమన్ నౌకపై విమానాన్ని పక్కకు లాగుతుండగా ప్రమాదం
- హౌతీల దాడి నుంచి తప్పించుకునే క్రమంలో ఘటన జరిగినట్లు అనుమానం
- ఒక నావికుడికి స్వల్ప గాయం.. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న అధికారులు
అమెరికా నౌకాదళానికి చెందిన యూఎస్ఎస్ హ్యారీ ఎస్ ట్రూమన్ విమానవాహక నౌక పైనుంచి అత్యంత ఖరీదైన యుద్ధ విమానం ఒకటి ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయింది. ఏప్రిల్ 28న ఎర్ర సముద్రంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్ట్రైక్ ఫైటర్ స్క్వాడ్రన్ 136కు చెందిన సుమారు 56 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.476 కోట్లు) విలువైన ఎఫ్/ఏ-18ఈ సూపర్ హార్నెట్ రకం యుద్ధ విమానాన్ని నౌకలోని హ్యాంగర్ బేలో టోయింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
యెమెన్‌లోని హౌతీ రెబల్స్ జరిపిన క్షిపణి, డ్రోన్ల దాడి నుంచి తప్పించుకునేందుకు నౌక ఆకస్మికంగా గట్టి మలుపు తీసుకుందని, ఆ సమయంలో విమానాన్ని లాగుతున్న సిబ్బంది దానిపై నియంత్రణ కోల్పోయారని అధికారులు చెబుతున్నారు. దీంతో ఫైటర్ జెట్, దానిని లాగుతున్న టో ట్రాక్టర్‌తో సహా సముద్రంలోకి జారిపోయినట్లు యూఎస్ నేవీ ఒక ప్రకటనలో ధృవీకరించింది.
"విమానాన్ని హ్యాంగర్ బేలో టో చేస్తుండగా సిబ్బంది నియంత్రణ కోల్పోయారు. విమానం, టో ట్రాక్టర్ సముద్రంలో పడిపోయాయి. విమానం పడే ముందు సిబ్బంది అప్రమత్తమై పక్కకు తప్పుకున్నారు. సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారు, ఒక నావికుడికి మాత్రం స్వల్ప గాయమైంది" అని నేవీ ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రమాదం జరిగినప్పటికీ, నౌక దళం కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతాయని నేవీ స్పష్టం చేసింది.
ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది. సముద్రంలో పడిపోయిన విమానాన్ని వెలికి తీయడం సాధ్యమేనా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు తెలిపారు. ఇరాన్ మద్దతుగల హౌతీ రెబల్స్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆపరేషన్లలో భాగంగా అమెరికా తన ప్రతిష్ఠాత్మక యూఎస్ఎస్ ట్రూమన్ నౌకను ఎర్ర సముద్రంలో మోహరించింది.
ఇదే యూఎస్ఎస్ ట్రూమన్ స్ట్రైక్ గ్రూప్‌కు చెందిన మరో సూపర్ హార్నెట్ విమానం డిసెంబర్ 2024లో స్నేహపూర్వక కాల్పుల (ఫ్రెండ్లీ ఫైర్) ఘటనలో ఎర్ర సముద్రంలోనే కూలిపోయింది. తాజా ప్రమాదంతో అమెరికా నౌకాదళం రెండో సూపర్ హార్నెట్ ఫైటర్ జెట్ ను కోల్పోయింది.