మోహన్ లాల్ కొత్త చిత్రం తుడరుమ్‌కు కలెక్షన్ల వర్షం

  • ఈ నెల 25న విడుదలైన మోహన్ లాల్ తుడరుమ్ 
  • సూపర్ హిట్ టాక్ తో హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకువెళుతున్న తుడరుమ్
  • ఎటువంటి ప్రమోషన్స్ లేకుండానే విడుదలై మంచి కలెక్షన్స్ రాబడుతున్న తుడరుమ్
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన తాజా చిత్రాలు భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్నాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో గత నెల 27న విడుదలైన 'ఎంపురాన్' బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. 'ఎంపురాన్' విడుదలై నెల రోజులు కాకుండానే మోహన్ లాల్ మరో సినిమా విడుదల చేశారు.

తరుణ్ మూర్తి దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా, అలనాటి అందాల నటి శోభన హీరోయిన్‌గా నటించిన 'తుడరుమ్' ఈ నెల 25న విడుదలైంది. ఈ చిత్రానికి కూడా ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన లభించింది. మొదటి షో తర్వాత మంచి టాక్ రావడంతో టికెట్ అమ్మకాలు ఊపందుకున్నాయి.

సినిమా విడుదలకు రెండు రోజుల ముందు ప్రారంభమైన అడ్వాన్స్ టికెట్ బుకింగ్‌లోనూ ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. అయితే, విడుదలైన రోజున తొలి ప్రదర్శన తర్వాత మంచి స్పందన రావడంతో టికెట్ బుకింగ్ వెబ్‌సైట్‌లలో అమ్మకం భారీగా పెరిగింది. ప్రముఖ బుకింగ్ ప్లాట్‌ఫారమ్ బుక్ మై షోలో గంటకు 35 వేల కంటే ఎక్కువ టికెట్లు అమ్ముడయ్యాయి. విడుదల తర్వాత ఈ సంఖ్య 'ఎంపురాన్' మూవీకి వచ్చిన దాని కంటే ఎక్కువ. ఇప్పుడు టికెట్ బుకింగ్ రికార్డు స్థాయికి చేరింది.

కాగా, ఈ సినిమా మలయాళంలో విడుదలైన ఒక రోజు తర్వాత తెలుగులో విడుదలైంది. ఎటువంటి ప్రమోషన్స్ లేకుండానే విడుదలై మంచి కలెక్షన్స్ రాబడుతోంది 'తుడరుమ్'. గత శుక్రవారం దాదాపు డజను సినిమాలు తెలుగులో విడుదల కాగా, 'తుడరుమ్' సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని హౌస్ ఫుల్ షోస్‌తో నడిచింది. దృశ్యం తరహా కథ, కథనాలు ప్రేక్షకులను మెప్పించాయి. మోహన్ లాల్ నటన, శోభన అభినయం ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకున్నాయి. అటు కేరళలోనూ రికార్డు స్థాయి కలెక్షన్స్ దిశగా 'తుడరుమ్' దూసుకువెళ్తోంది. 


More Telugu News