ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి... రాజస్థాన్ అద్భుత విజయం

  • రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.
  • గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 35 బంతుల్లోనే శతకం పూర్తి.
  • ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 11 సిక్సర్లతో మొత్తం 101 పరుగులు నమోదు చేసిన చిచ్చరపిడుగు
  • ఐపీఎల్‌లో అతి పిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డ్.
  • 8 వికెట్ల తేడాతో గెలిచిన రాజస్థాన్ రాయల్స్
ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 35 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీ సాధించి పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్‌కు వేదికైంది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. అనంతరం 210 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్‌లో వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన వైభవ్, గుజరాత్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు.

కేవలం 17 బంతుల్లోనే తన తొలి ఐపీఎల్ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్న ఈ యువ సంచలనం, అదే ఊపును కొనసాగించాడు. ముఖ్యంగా గుజరాత్ బౌలర్ కరీం జనత్ వేసిన ఒక ఓవర్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో ఏకంగా 30 పరుగులు రాబట్టి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో కేవలం 35 బంతుల్లోనే శతకాన్ని అందుకుని, ఐపీఎల్ చరిత్రలోనే రెండో వేగవంతమైన సెంచరీని నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అయితే, సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాతి బంతికే గుజరాత్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తన ఇన్నింగ్స్‌లో వైభవ్ మొత్తం 38 బంతులు ఎదుర్కొని, 7 ఫోర్లు, 11 సిక్సర్ల సహాయంతో 101 పరుగులు చేశాడు.

ఇదే మ్యాచ్‌లో మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా అర్ధ సెంచరీతో రాణించాడు. ఈ అసాధారణ ఇన్నింగ్స్‌తో వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2025 సీజన్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేయడమే కాకుండా, ఐపీఎల్ చరిత్రలో సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా (14 ఏళ్లు) సరికొత్త రికార్డును సృష్టించాడు. 

8 వికెట్ల తేడాతో గెలిచిన రాజస్థాన్

మొత్తమ్మీద సూర్యవంశి సంచలన ఇన్నింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ పై అద్భుత విజయం సాధించింది. 210 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వైభవ్ సూర్యవంశి 101, యశస్వి జైస్వాల్ 70, కెప్టెన్ రియాన్ పరాగ్ 32 (నాటౌట్) అదరగొట్టారు. ముఖ్యంగా, సూర్యవంశి, జైస్వాల్ జోడీ తొలి వికెట్ కు 166 పరుగులు జోడించడం విశేషం. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 1, రషీద్ ఖాన్ 1 వికెట్ తీశారు.




More Telugu News