ప‌హ‌ల్గామ్‌కు రండి... ప‌ర్యాట‌కుల‌కు ప్ర‌ముఖ న‌టుడి విజ్ఞ‌ప్తి

      
ఈ నెల 22న జ‌మ్మూక‌శ్మీర్‌లోని ప‌హ‌ల్గామ్‌లో ఉగ్ర‌వాదులు న‌ర‌మేధం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఈ పాశ‌విక దాడిలో 26 మంది ప‌ర్యాట‌కులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న త‌ర్వాత జ‌మ్మూకు వెళ్లేందుకు సంద‌ర్శ‌కులు ఒక‌టికిరెండుసార్లు ఆలోచిస్తున్నారు. ఇక‌, ఉగ్ర‌దాడి త‌ర్వాత ప్ర‌ముఖ న‌టుడు అతుల్ కుల‌క‌ర్ణి ప‌హ‌ల్గామ్‌ను సంద‌ర్శించారు. 

ఈ సంద‌ర్భంగా ఈ ప్రాంతానికి సంఘీభావం తెలుపుతూ, తోటి భారతీయులు కశ్మీర్‌కు వెళ్లి తమ మద్దతును తెలియజేయాలని ఆయన కోరారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో ఆయ‌న ముచ్చ‌టించారు. 

"కశ్మీర్ సుర‌క్షిత‌మ‌ని, ప‌ర్యాట‌కులు ఇక్క‌డికి రావాల‌ని, వారి బాధ్య‌త‌ను తాము తీసుకుంటామ‌ని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతం ఎంత సుంద‌రంగా ఉందో... ఇక్క‌డి మ‌నుషులు కూడా అంతే అద్భుతంగా ఉన్నారు.  ఇక్క‌డి ప్రజల‌ను క‌లిసిన‌ప్ప‌డు ఇప్ప‌టికీ వారి క‌ళ్ల‌ల్లో బాధ క‌నిపిస్తోంది. కానీ వారిని కలిసి నేను ఇక్కడికి రావడానికి గల ఉద్దేశ్యాన్ని పంచుకున్న త‌ర్వాత వారు నవ్వ‌డం చూశాను. 

సెల‌బ్రిటీలు భ‌రోసా క‌ల్పిస్తేనే సామాన్యుల‌కు కూడా కశ్మీర్ సేఫ్ అనే భావ‌న క‌లుగుతుందని, ఇది చాలా ముఖ్యమ‌ని వారు అంటున్నారు. మీరు ప్రజలను ఇక్కడికి రమ్మని చెప్పాల‌ని, వారు సురక్షితం అనే స‌మాచారం ఇవ్వాల‌ని నాతో అన్నారు. వారి బాధ్యత తాము తీసుకుంటామ‌ని చెప్పారు" అని అతుల్ కుల‌క‌ర్ణి ఏఎన్ఐకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నారు. 

ప‌ర్యాట‌కులు క‌చ్చితంగా ప‌హ‌ల్గామ్‌కు రావాల‌ని ఆయ‌న కోరారు. అలాగే ముంబ‌యి నుంచి శ్రీనగర్ కు త‌న‌ భావోద్వేగ ప్రయాణాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కూడా న‌టుడు అభిమానుల‌తో పంచుకున్నారు. 


More Telugu News