ఐపీఎల్ లో చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్

  • ఇవాళ లక్నో జట్టుతో మ్యాచ్ ద్వారా 4 వేల పరుగులు పూర్తి చేసుకున్న సూర్య
  • అతి తక్కువ బంతుల్లో ఈ ఘనత సాధించిన తొలి భారత బ్యాటర్ గా రికార్డు 
  • గతంలో కేఎల్ రాహుల్ పేరిట ఈ రికార్డు 
  • రాహుల్ ను అధిగమించిన సూర్య
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో ముంబయి ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆదివారం నాడు వాంఖడే స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా సూర్య ఐపీఎల్ లో 4,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. కేవలం 2714 బంతుల్లోనే ఈ ఘనత సాధించి, ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 4000 పరుగులు పూర్తి చేసిన భారతీయ బ్యాటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు.

ఇంతకుముందు ఈ రికార్డు కేఎల్ రాహుల్ పేరిట ఉండేది. రాహుల్ 2820 బంతుల్లో 4000 పరుగుల మార్కును చేరుకున్నాడు. సూర్యకుమార్ తన వేగవంతమైన బ్యాటింగ్‌తో ఆ రికార్డును బద్దలు కొట్టాడు. 

ఐపీఎల్ చరిత్రలో ఓవరాల్‌గా చూస్తే... క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ (ఇద్దరూ 2658 బంతుల్లో) తర్వాత అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా సూర్యకుమార్ నిలిచాడు. ఇదే మ్యాచ్‌లో రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో తన ఇన్నింగ్స్‌లో తొలి సిక్సర్ కొట్టడం ద్వారా ఐపీఎల్‌లో 150 సిక్సర్లు పూర్తి చేసుకున్న మరో మైలురాయిని కూడా సూర్య దాటాడు.

ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా ఆడి కేవలం 28 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 54 పరుగులు చేశారు. 


More Telugu News