అటారీ-వాఘా బోర్డర్ వద్ద భావోద్వేగ దృశ్యాలు... తల్లులను వీడి పాక్ వెళ్లిపోయిన పిల్లలు!

  • పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ ప్రయాణ ఆంక్షలు
  • భారత పాస్‌పోర్ట్‌లున్న తల్లులను పాక్ వెళ్లకుండా నిలిపివేత
  • పాక్ పౌరసత్వం ఉన్న పిల్లలు, భర్తలతో విడిపోయిన భారతీయ మహిళలు
  • అటారీ-వాఘా సరిహద్దు వద్ద కుటుంబాల కన్నీటి వీడ్కోలు
  • ఉగ్రవాదులను శిక్షించాలి, తమను విడదీయవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య రాకపోకలపై విధించిన ఆంక్షలు పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. పాకిస్థానీ భర్తలను వివాహం చేసుకున్న భారతీయ మహిళలు, తమ పిల్లలతో సహా పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లేందుకు ప్రయత్నించగా, సరిహద్దు అధికారులు వారిని నిలిపివేశారు. భారత పాస్‌పోర్ట్ కలిగి ఉండటమే ఇందుకు కారణంగా మారింది. దీంతో పాకిస్థాన్ పౌరసత్వం కలిగిన పిల్లలు, కట్టుకున్న భర్తలు తల్లులను ఇక్కడే వదిలి భారంగా పాక్‌కు పయనమయ్యారు. పంజాబ్‌లోని అటారీ-వాఘా సరిహద్దు వద్ద ఈ హృదయ విదారక దృశ్యాలు చోటుచేసుకున్నాయి.

రెండు కుటుంబాల వ్యధ

వివరాల్లోకి వెళితే, పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్ ఇర్ఫాన్‌ను భారతీయ మహిళ నబీలా చాలా ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. ఢిల్లీలో ఉన్న తన తల్లిని చూసేందుకు నబీలా, తన భర్త, పిల్లలతో కలిసి భారత్‌కు వచ్చారు. అయితే, పహల్గామ్ దాడి తర్వాత పరిస్థితులు మారాయి. పాకిస్థాన్ పౌరులు తిరిగి తమ దేశానికి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించడంతో సమస్య మొదలైంది. నబీలా వద్ద భారత పాస్‌పోర్ట్ ఉండటంతో, ఆమెను పాకిస్థాన్ వెళ్లేందుకు అధికారులు అనుమతించలేదు. ఫలితంగా, పాక్ పౌరసత్వం ఉన్న ఆమె పిల్లలు 11 ఏళ్ల జైనాబ్, 8 ఏళ్ల జెనీష్‌లను తండ్రి మహ్మద్ ఇర్ఫాన్ వెంట పాకిస్థాన్‌కు తీసుకెళ్లాల్సి వచ్చింది. తల్లిని విడిచి వెళ్లలేక ఆ చిన్నారులు కన్నీరుమున్నీరయ్యారు.

ఇలాంటిదే మరో ఘటనలో, 18 ఏళ్లుగా కరాచీలో నివసిస్తున్న మహ్మద్ ఇమ్రాన్, షర్మీన్ దంపతులు తమ కుమార్తెలతో భారత్‌కు వచ్చారు. షర్మీన్‌కు భారత పాస్‌పోర్ట్ ఉండటంతో ఆమెను కూడా అధికారులు పాక్‌కు వెళ్లేందుకు నిరాకరించారు. భర్త ఇమ్రాన్, పాక్ పౌరసత్వం ఉన్న కుమార్తెలను తీసుకుని వెనుదిరిగాడు. తల్లి లేకుండా వెళ్లాల్సి రావడంతో పిల్లలు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

ప్రభుత్వానికి కుటుంబాల విజ్ఞప్తి

ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాయి. "భారత పాస్‌పోర్ట్ ఉన్నవారిని పాకిస్థాన్ వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. నా భర్త, పిల్లలు పాకిస్థాన్ పౌరులు. వారిని పంపించి, నన్ను ఇక్కడ ఆపేస్తే నేనెలా బతకాలి?" అని ఓ భారతీయ మహిళ కన్నీటితో ప్రశ్నించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా అమాయక కుటుంబాలను విడదీయడం సరికాదని వారు వాపోయారు. "ఉగ్రవాదులను కఠినంగా శిక్షించండి, అంతేకానీ వీసాలు ఉండి, చట్టబద్ధంగా వివాహాలు చేసుకున్న మాలాంటి వారిని విడదీయకండి" అని వారు భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 

అటారీ-వాఘా సరిహద్దు వద్ద ఉన్న మరో వ్యక్తి మాట్లాడుతూ, "చెల్లుబాటు అయ్యే వీసా ఉండి, అక్కడ వివాహం చేసుకున్న వారిని వెళ్లనివ్వాలి" అని కోరారు. ప్రభుత్వ నిబంధనలు అమాయక కుటుంబాల పాలిట శాపంగా మారాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


More Telugu News