వీడు మామూలు దొంగ కాదు... అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ చీఫ్ బ్యాగ్ నే కొట్టేశాడు!

  • వాషింగ్టన్‌లో క్రిస్టీ నోమ్ హ్యాండ్ బాగ్ చోరీ
  • శ్వేత సౌధం దగ్గరలోని రెస్టారెంట్‌లో మార్చి 20న ఘటన
  • లక్షల విలువైన గూచీ బ్యాగ్, నగదు, పాస్‌పోర్ట్, డీహెచ్‌ఎస్ బ్యాడ్జ్ అపహరణ
  • సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగను గుర్తించి, వారం తర్వాత అరెస్ట్ చేసిన పోలీసులు
  • నిందితుడు ప్రొఫెషనల్ దొంగల ముఠా సభ్యుడని గుర్తింపు
అమెరికా ప్రభుత్వంలో అత్యంత కీలకమైన హోంల్యాండ్ సెక్యూరిటీ చీఫ్ క్రిస్టీ నోమ్ వస్తువులకే రక్షణ లేకుండా పోయింది. వాషింగ్టన్ డీసీలోని ఓ రెస్టారెంట్‌లో ఆమెకు చెందిన ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్‌ను ఓ దొంగ చాకచక్యంగా అపహరించాడు. ఈ ఘటన మార్చి 20న జరగగా, దాదాపు వారం రోజుల పాటు ముమ్మర దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు.

వివరాల్లోకి వెళితే, మార్చి 20న క్రిస్టీ నోమ్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి ఈస్టర్ పార్టీ కోసం వైట్ హౌస్ సమీపంలో ఉన్న 'ది క్యాపిటల్ బర్గర్' అనే రెస్టారెంట్‌కు వెళ్లారు. అదే సమయంలో, ముదురు రంగు దుస్తులు, బేస్‌బాల్ క్యాప్ ధరించి, ముఖానికి సర్జికల్ మాస్క్ పెట్టుకున్న ఓ వ్యక్తి ఆ రెస్టారెంట్‌లోకి వచ్చాడు. చుట్టూ గమనించి, నోమ్‌ కూర్చున్న టేబుల్ పక్కనే కూర్చున్న ఆ ఆగంతకుడు, ఆమె పక్కన పెట్టిన బ్యాగ్‌ను నెమ్మదిగా తనవైపు లాక్కొని, దానిపై కోటు కప్పి తీసుకుని అక్కడి నుంచి ఉడాయించాడు.

చోరీకి గురైన బ్యాగ్ ప్రముఖ లగ్జరీ బ్రాండ్'గూచీ' కి చెందినదని, దాని విలువ సుమారు 4,400 డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 3.76 లక్షలు) ఉంటుందని తెలిసింది. ఆ బ్యాగ్‌లో దాదాపు 3,000 డాలర్ల (సుమారు రూ. 2.56 లక్షలు) నగదుతో పాటు, ఆమె పాస్‌పోర్ట్, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ (డీహెచ్‌ఎస్) అధికారిక బ్యాడ్జ్, అపార్ట్‌మెంట్ తాళం చెవులు, కొన్ని రహస్య పత్రాలు కూడా ఉన్నాయని సమాచారం.

ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. రెస్టారెంట్‌లోని సీసీటీవీ కెమెరా దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఫుటేజీలో ఓ వ్యక్తి అనుమానాస్పద కదలికలను గుర్తించి, అతని ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు వారం రోజుల విచారణ అనంతరం నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు.

ఈ ఘటనపై క్రిస్టీ నోమ్‌ ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ తన అనుభవాన్ని పంచుకున్నారు. "ఈ సంఘటనతో నేను తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. నా బ్యాగ్‌ను నా కాలి పక్కనే పెట్టుకున్నాను. ఓ వ్యక్తి వచ్చి పక్కనే కూర్చుని, దాన్ని తన కాలితో కొంచెం దూరం లాగి, దానిపై కోటు వేసి తీసుకుపోయాడు. ఇలాంటి ఘటనల్లో సామాన్య ప్రజలు ఎలా బాధితులుగా మారుతారో నాకు ఇప్పుడు అర్థమైంది" అని ఆమె తెలిపారు. పట్టుబడిన దొంగ చాలా నైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్ అని కూడా ఆమె పేర్కొన్నారు.

అరెస్ట్ అయిన నిందితుడు 'ఈస్ట్‌కోస్ట్ గ్యాంగ్' అనే ముఠాలో సభ్యుడని, అత్యంత విలువైన వస్తువులను తస్కరించడంలో ఈ ముఠా ఆరితేరిందని అధికారులు వెల్లడించారు. ఆసక్తికర విషయం ఏమిటంటే, దొంగతనం జరిగిన సమయంలో క్రిస్టీ నోమ్ కు రక్షణగా ఉండే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు (సాధారణ దుస్తుల్లో) కూడా అదే రెస్టారెంట్‌లో ఉన్నారట. అయినప్పటికీ ఈ చోరీ జరగడం భద్రతా వైఫల్యాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.


More Telugu News