Lakshmi Prasanna: బిడ్డ తెల్లగా పుట్టాడని భర్త అనుమానం... భార్య ఆత్మహత్య.. ఇద్దరూ ఐటీ ఉద్యోగులే

- కొడుకు తెల్లగా పుట్టాడన్న అనుమానంతో భర్త తిరుపతి వేధింపులు
- అదనపు కట్నం డిమాండ్లు కూడా తోడవడంతో తీవ్ర మనస్తాపం
- పుట్టింట్లో ఉరివేసుకుని బలవన్మరణం, అద్దంపై సూసైడ్ నోట్
కన్న కొడుకు శరీర ఛాయపై అనుమానం, అదనపు కట్నం కోసం వేధింపులు ఓ వివాహిత ప్రాణాన్ని బలిగొన్నాయి. ఈ దారుణ సంఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదాన్ని నింపింది. భర్త, అత్తమామల నుంచి ఎదురవుతున్న వేధింపులు భరించలేక లక్ష్మీప్రసన్న (29) అనే మహిళ తన పుట్టింట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
జగిత్యాలలోని పోచమ్మవాడకు చెందిన లక్ష్మీప్రసన్నకు, వెల్గటూర్ మండలం రాంనూర్ గ్రామానికి చెందిన తిరుపతితో సరిగ్గా రెండేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరూ ఉన్నత విద్యావంతులు కావడంతో పాటు బెంగళూరులోని ఐటీ కంపెనీలలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా గత ఏడాది ఒక కుమారుడు జన్మించాడు.
అయితే, తమ ఇద్దరి శరీర ఛాయలకు భిన్నంగా బాబు తెల్లగా ఉండటంతో భర్త తిరుపతికి అనుమానం మొదలైంది. 'మనమిద్దరం ఇలా ఉంటే, బాబు ఇంత తెల్లగా ఎలా పుట్టాడు?' అంటూ భార్య లక్ష్మీప్రసన్నను తరచూ ప్రశ్నిస్తూ, ఆమె శీలాన్ని శంకిస్తూ మానసికంగా తీవ్ర వేధింపులకు గురిచేసినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ అనుమానానికి తోడు అదనపు కట్నం తీసుకురావాలంటూ అత్తమామలు కూడా వేధించడం ప్రారంభించారని వారు తెలిపారు.
రోజురోజుకూ భర్త, అత్తమామల వేధింపులు శృతిమించడంతో లక్ష్మీప్రసన్న తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైంది. ఈ క్రమంలోనే ఆమె తన ఉద్యోగాన్ని సైతం వదిలేసి ఇంటి వద్దే ఉంటున్నట్లు సమాచారం. వేధింపులు భరించలేని స్థితికి చేరడంతో, ఐదు రోజుల క్రితం లక్ష్మీ ప్రసన్న జగిత్యాలలోని తన పుట్టింటికి వచ్చేసింది. అయినప్పటికీ, ఆమె మానసిక వేదన తగ్గలేదు.
తీవ్ర మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి, లక్ష్మీ ప్రసన్న గదిలోని అద్దంపై "అమ్మానాన్న.. నాకిక బతకాలని లేదు. నా కొడుకు జాగ్రత్త. బాబును వాళ్లకు ఇవ్వకండి" అని రాసి, ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో లక్ష్మీ ప్రసన్న కుటుంబంలో పెను విషాదం అలుముకుంది.
మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. భర్త తిరుపతి, అతని తల్లిదండ్రులపై వరకట్న వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగాల్లో ఉన్న దంపతుల మధ్య ఇలాంటి అనుమానాలు, వేధింపులు ఒకరి ప్రాణాన్ని బలిగొనడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.