ఇన్ఫోసిస్ లో జాబ్ కోసం తెలంగాణ యువకుడి అతి తెలివి... 15 రోజుల్లో దొరికిపోయాడు!

  • ఇన్ఫోసిస్ లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న యువకుడు సాయి ప్రశాంత్
  • వర్చువల్ ఇంటర్వ్యూలో తన స్నేహితుడ్ని కూర్బోబెట్టిన వైనం
  • ఉద్యోగంలో చేరాక కమ్యూనికేషన్ స్కిల్స్ లో తడబాటు
  • పక్కా ఆధారాలతో పట్టేసిన ఇన్ఫోసిస్ వర్గాలు
  • బెంగళూరులో కేసు నమోదు
ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం సంపాదించేందుకు ఓ తెలంగాణ యువకుడు మోసపూరిత మార్గాన్ని ఎంచుకున్నాడు. వర్చువల్ ఇంటర్వ్యూకు తన స్థానంలో వేరొకరిని (ఇంపోస్టర్) ప్రవేశపెట్టి యాజమాన్యాన్ని తప్పుదోవ పట్టించాడు. అయితే, ఉద్యోగంలో చేరిన కొద్ది రోజులకే అసలు విషయం బయటపడటంతో కంపెనీ అతడిని విధుల నుంచి తొలగించి, పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వివరాల్లోకి వెళితే.. తెలంగాణకు చెందిన రాపా సాయి ప్రశాంత్ అనే యువకుడు ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకోసం అతను ఒక జాబ్ పోర్టల్ ద్వారా తన రెజ్యూమెను ఇన్ఫోసిస్‌కు రిక్రూట్‌మెంట్ సేవలు అందించే సంప్రదా సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ అనే సంస్థకు పంపించాడు. ఆ సంస్థ ప్రాథమిక వివరాలు పరిశీలించి, ప్రశాంత్ రెజ్యూమెను ఇన్ఫోసిస్‌కు ఫార్వార్డ్ చేసింది.

అనంతరం, ఇన్ఫోసిస్ ఈ ఏడాది జనవరిలో ప్రశాంత్‌కు వర్చువల్ ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూకు ప్రశాంత్ హాజరు కాకుండా, తన స్నేహితుడిని తనలా నటించమని పురమాయించాడు. ఇంటర్వ్యూలో ఆ డమ్మీ అభ్యర్థి ప్రతిభ కనబరచడంతో, ఇన్ఫోసిస్ ప్రశాంత్‌ను ఎంపిక చేసి ఆఫర్ లెటర్ జారీ చేసింది. ఆ తర్వాత ప్రశాంత్ విధుల్లో చేరాడు.

అయితే, ఉద్యోగంలో చేరిన తర్వాత ప్రశాంత్ కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ఇతర పనితీరు ఇంటర్వ్యూ సమయంలో ప్రదర్శించిన దానికి పొంతన లేకుండా ఉండటంతో కంపెనీ ప్రతినిధులకు అనుమానం కలిగింది. దీంతో వారు వర్చువల్ ఇంటర్వ్యూ స్క్రీన్‌షాట్లను, ప్రశాంత్ ఫోటోను పోల్చి చూడగా అసలు మోసం బయటపడింది. ఇంటర్వ్యూకు హాజరైంది ప్రశాంత్ కాదని, వేరొక వ్యక్తి అని నిర్ధారణకు వచ్చారు. సుమారు 15 రోజుల పాటు ప్రశాంత్ ఉద్యోగం చేసినట్లు సమాచారం.

ఈ మోసం వెలుగులోకి రావడంతో ఇన్ఫోసిస్ యాజమాన్యం తక్షణమే ప్రశాంత్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. అనంతరం, రిక్రూట్‌మెంట్ భాగస్వామి అయిన సంప్రదా సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ అకౌంట్స్ మేనేజర్ కిశోర్ ద్వారా బెంగళూరులోని అడుగోడి పోలీస్ స్టేషన్‌లో ప్రశాంత్‌పై మోసం (చీటింగ్), ఇంపర్సొనేషన్ (ఒకరిలా మరొకరు నటించడం) కింద ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఐటీ చట్టం, భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 318, 319 కింద కేసు నమోదు చేశారు.



More Telugu News