ప్రధాని మోదీ పర్యటనపై మంత్రి నారాయణ సమీక్ష
- మే 2న అమరావతిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన
- రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాని
- ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ, అధికారులు
ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, ప్రధాని పర్యటన ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రధాని పర్యటన కేవలం గంటన్నర మాత్రమే ఉంటుందని, భద్రతా కారణాల దృష్ట్యా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రధాని కాన్వాయ్ సాఫీగా సాగేందుకు 8 మార్గాలను గుర్తించామని, సభకు వచ్చే వాహనాల పార్కింగ్ కోసం 11 ప్రాంతాలను సిద్ధం చేస్తున్నామని మంత్రి వివరించారు.
గత ఐదేళ్లలో ఇబ్బందులు పడిన అమరావతి రైతులలో కొందరిని (కనీసం ముగ్గురు, నలుగురిని) ప్రధాని సమక్షంలో సన్మానించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారని నారాయణ పేర్కొన్నారు. అదనపు ల్యాండ్ పూలింగ్ విషయంపై స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చిస్తున్నామని, ప్రజల అంగీకారంతోనే పూలింగ్ ఉంటుందని, లేనిపక్షంలో భూసేకరణ గురించి ప్రభుత్వం ఆలోచిస్తుందని ఆయన అన్నారు. రాబోయే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నిర్మాణాన్ని చేపడుతున్నారని మంత్రి నారాయణ తెలిపారు.