పాక్ హీరోతో సినిమా.. భార‌త హీరోయిన్‌పై నెటిజ‌న్ల ఫైర్‌.. పోస్ట్ డిలీట్ చేసిన న‌టి!

  • హీరో ఫ‌వాద్ ఖాన్, న‌టి వాణీ క‌పూర్ జంట‌గా 'అబీర్ గులాల్‌'
  • మే 9న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సినిమా 
  • ప్ర‌స్తుతం జోరుగా జ‌రుగుతున్న ప్ర‌మోష‌న్స్‌
  • మంగ‌ళ‌వారం చిత్ర పోస్ట‌ర్‌ను త‌న 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేసిన హీరోయిన్‌
  • అదే రోజు ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి ఘ‌ట‌న‌.. దీంతో న‌టిపై నెటిజ‌న్ల ఆగ్ర‌హం
పాకిస్థాన్‌కు చెందిన హీరో ఫ‌వాద్ ఖాన్ సినిమాను ప్ర‌మోట్ చేశారంటూ వస్తున్న విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో బాలీవుడ్ న‌టి వాణీ క‌పూర్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌)లో అందుకు సంబంధించిన పోస్ట‌ర్‌ను డిలీట్ చేశారు. ఫ‌వాద్‌, వాణీ జంట‌గా తెర‌కెక్కిన తాజా చిత్రం 'అబీర్ గులాల్‌'. ఈ సినిమా మే 9న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 

దీంతో ఈ చిత్ర‌ ప్ర‌మోష‌న్స్ ప్ర‌స్తుతం జోరుగా కొన‌సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆమె ఓ పోస్ట‌ర్‌ను మంగ‌ళ‌వారం త‌న ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. అయితే, ప‌హ‌ల్‌గామ్ ఉగ్ర‌వాద దాడి సంద‌ర్భంగా పాక్ న‌టుడి చిత్రాన్ని ప్ర‌మోట్ చేస్తారా అంటూ నెటిజ‌న్లు వాణీ క‌పూర్‌పై ఫైర్ అయ్యారు. 

దాంతో చేసేదేమీలేక ఆమె ఆ పోస్టును డిలీట్ చేశారు. అలాగే ఈ దాడిపై స్పందిస్తూ మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారామె. హీరో ఫ‌వాద్ ఖాన్ కూడా ఈ పాశ‌విక‌ దాడిని ఖండిస్తూ సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టారు. 

మ‌రోవైపు ఈ మూవీని బాయ్‌కాట్ చేయాలంటూ ఎక్స్‌లో హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని ప్ర‌క‌టించిన మొద‌టి నుంచే వ్య‌తిరేక‌త ఉండ‌గా... తాజాగా జ‌రిగిన ఉగ్ర‌దాడితో ఆ వ్య‌తిరేక‌త‌ మ‌రింత పెరిగింది. ఈ మూవీని ప్రోత్స‌హిస్తున్నందుకు హిందీ చిత్ర‌సీమ (బాలీవుడ్‌)పై కూడా తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.  


More Telugu News