బాలుడి నిర్ల‌క్ష్య డ్రైవింగ్‌కు ఒక‌రి బ‌లి.. వాహ‌న య‌జ‌మానికి రూ. 1.41 కోట్ల ఫైన్‌!

  • క‌ర్ణాట‌క‌లోని కొప్ప‌ళ జిల్లా య‌ళ‌బుర్గ‌లో ఘ‌ట‌న‌
  • 17 ఏళ్ల బాలుడు ఆటో న‌డుపుతూ రోడ్డు ప‌క్క‌న వెళ్తున్నవారిని ఢీకొట్టిన వైనం
  • ఈ ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌ప‌డ్డ రాజ‌శేఖ‌ర్ మృతి
  • అతని భార్య తాలూకా న్యాయ సేవా స‌మితిలో ఫిర్యాదు 
  • తాజాగా జ‌డ్డి తీర్పును వెల్ల‌డిస్తూ ఆటో య‌జ‌మానికి రూ. 1,41,61,580 ఫైన్  
క‌ర్ణాట‌క‌లో 17 ఏళ్ల ఓ బాలుడు నిర్ల‌క్ష్యంగా ఆటో న‌డిపి ఒక‌రి మృతికి కార‌ణ‌మైన ఘ‌ట‌న‌లో కోర్టు తీవ్రంగా స్పందించింది. బాలుడికి ఆ వాహ‌నం ఇచ్చిన దాని య‌జ‌మానికి రూ. 1.41 కోట్ల జ‌రిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. బాల‌ల చేతికి వాహ‌నాలు ఇవ్వ‌ద్ద‌నే హెచ్చ‌రిక‌లాంటి ఈ తీర్పును క‌ర్ణాట‌క‌లోని ఓ తాలూకా కోర్టు వెల్ల‌డించింది.

వివ‌రాలోకి వెళితే... కొప్ప‌ళ జిల్లా య‌ళ‌బుర్గ‌లో 2021లో 17 ఏళ్ల బాలుడు ఆటో న‌డుపుతూ రోడ్డు ప‌క్క‌న వెళ్తున్న పాదాచారుల‌ను ఢీకొట్టాడు. ఈ ఘ‌ట‌న‌లో జ‌య‌న‌గ‌ర‌కు చెందిన ఉద్యోగి రాజ‌శేఖ‌ర్ అయ్య‌న‌గౌడ (48)తో పాటు మ‌రికొంద‌రు గాయ‌ప‌డ్డారు. తీవ్రంగా గాయ‌ప‌డ్డ రాజ‌శేఖ‌ర్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ చ‌నిపోయారు. 

దీంతో ఆయ‌న భార్య చెన‌మ్మ గంగావ‌తి తాలూకా న్యాయ సేవా స‌మితిలో ఫిర్యాదు చేశారు. ఈ కేసును జ‌డ్జి ర‌మేశ్ ఎస్‌. గాణిగెరె విచారించారు. తాజాగా తీర్పును వెల్ల‌డిస్తూ... బాలుడికి ఆటో ఇచ్చిన య‌జ‌మానికి రూ. 1,41,61,580 ఫైన్ విధించారు. బాలుడు అని తెలిసి, అత‌ని చేతికి ఆటో ఎలా ఇస్తార‌ని వాహ‌న య‌జ‌మానిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జ‌రిమానా మొత్తాన్ని మృతుడు రాజ‌శేఖ‌ర్ కుటుంబంలోని ముగ్గురికి స‌మానంగా పంచాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.   




More Telugu News