జహీర్‌తో పంత్ తీవ్ర చర్చ.. వైరల్ వీడియో ఇదిగో!

  • పంత్ బ్యాటింగ్ ఆర్డర్ మార్పు.. ఎల్ఎస్‌జీ ఓటమిపై తీవ్ర విమర్శలు
  • 7వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన పంత్.. చివరి బంతికి ఔట్
  • మ్యాచ్ సమయంలో మెంటార్ జహీర్ ఖాన్‌తో పంత్ తీవ్రంగా చర్చిస్తున్న వీడియో వైరల్
ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) జట్టుకు మరో ఓటమి ఎదురైంది. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎల్ఎస్‌జీ 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో ఎల్ఎస్‌జీ కెప్టెన్ రిషబ్ పంత్ తీసుకున్న నిర్ణయాలు, అతని ప్రదర్శన తీవ్ర విమర్శలకు దారితీసింది. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్‌లో అతను ఏకంగా ఏడో స్థానంలో క్రీజులోకి రావడం అభిమానులను, విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది.

లక్నో ఇన్నింగ్స్ చివరి ఓవర్ చివరి బంతికి పంత్ బ్యాటింగ్‌కు వచ్చాడు. కేవలం రెండు బంతులు మాత్రమే ఎదుర్కొని, ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కెప్టెన్‌గా కీలక సమయంలో బాధ్యత తీసుకోకుండా బ్యాటింగ్ ఆర్డర్‌లో ఇంత వెనుకకు వెళ్లడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అంతకుముందు, ఇన్నింగ్స్ 19వ ఓవర్ సమయంలో, ప్యాడ్లతో సిద్ధంగా ఉన్న పంత్.. డగౌట్‌లో జట్టు మెంటార్ జాహీర్ ఖాన్‌తో ఏదో విషయంపై తీవ్రంగా చర్చిస్తున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. పంత్ హావభావాలు చూస్తుంటే, ఏదో కీలక విషయంపైనే వారి మధ్య సంభాషణ జరిగినట్లు కనిపించింది.

మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై పంత్ స్పందించాడు. "మేం సుమారు 20 పరుగులు తక్కువ చేశామని తెలుసు. లక్నోలో టాస్ చాలా కీలకం. మొదట బౌలింగ్ చేసే జట్టుకు పిచ్ నుంచి మంచి సహకారం లభిస్తుంది. మేం కుదురుకోవడానికి ప్రయత్నించాం కానీ పరుగులు చేయలేకపోయాం" అని పంత్ తెలిపాడు. లక్నో నిర్దేశించిన 160 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ సునాయాసంగా ఛేదించింది. రాహుల్ (42 బంతుల్లో), అభిషేక్ పోరెల్ (51) రెండో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నెలకొల్పడంతో ఢిల్లీ 13 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.


More Telugu News