జమ్మూకశ్మీర్ ఉగ్ర దాడిపై ప్రధాని మోదీ, జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందన

  • దాడి వెనుక ఉన్న వారిని వదిలి పెట్టేది లేదన్న ప్రధానమంత్రి
  • ఉగ్రవాదంపై పోరాడాలనే తమ సంకల్పం అచంచలమైనదన్న మోదీ
  • దాడికి పాల్పడిన వారు మానవ మృగాలు అన్న ఒమర్ అబ్దుల్లా
జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఈ దాడిలో దాదాపు 20 మంది మరణించినట్టు తెలుస్తోంది.

పహల్గాం దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మోదీ 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపిన ప్రధాని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

దాడి వెనుక ఉన్న వారిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టే ప్రసక్తి లేదని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారి దుష్ట అజెండా ఎప్పటికీ విజయవంతం కాదని అన్నారు. ఉగ్రవాదంపై పోరాడాలనే తమ సంకల్పం అచంచలమైనదని, ఇలాంటి దాడుల వల్ల అది మరింత బలపడుతుందని అన్నారు.

పర్యాటకులపై దాడి ఘటన తీవ్రంగా బాధించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని అన్నారు. నేరస్థులపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఘటన గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించానని, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. అత్యవసర భద్రతా సమీక్ష కోసం శ్రీనగర్ వెళుతున్నట్లు తెలిపారు.

దాడిని ఖండించిన ఒమర్ అబ్దుల్లా

పహల్గాం ఉగ్రదాడిని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఖండించారు. దీనిని హేయమైన చర్యగా పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారు మానవ మృగాలని, ఘటనను ఖండించేందుకు మాటలు రావడం లేదని అన్నారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు.


More Telugu News