సినీ నటి జత్వానీ వేధింపుల కేసు... ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ పై ధూళిపాళ్ల నరేంద్ర కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్లో పీఎస్ఆర్ ఆంజనేయులుని అదుపులోకి తీసుకున్న ఏపీ సీఐడీ
- నటి కాదంబరి జత్వానీ వేధింపుల కేసులో అరెస్ట్
- గత ప్రభుత్వంలో అధికార దుర్వినియోగం చేశారన్న ధూళిపాళ్ల
గత పాలనలో ఏసీబీ, ఇంటెలిజెన్స్ వంటి కీలక విభాగాల్లో పనిచేసిన పీఎస్ఆర్ ఆంజనేయులు, తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని ధూళిపాళ్ల విమర్శించారు. టీడీపీ నాయకులను, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించిన వారిని, చివరికి మహిళలను సైతం లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు బనాయించి వేధించారని ఆయన ఆరోపించారు. ఆయన తన అధికారాన్ని న్యాయం కోసం కాకుండా ప్రతీకారం తీర్చుకోవడానికే ఉపయోగించారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మందిని బెదిరించారని, అరెస్టులు చేయించారని, వారి పరువుకు భంగం కలిగించారని దుయ్యబట్టారు. ఎందరో మహిళల కన్నీళ్లకు ఆయనే కారణమని అన్నారు.
ఏపీపీఎస్సీ పేపర్ లీక్ కుంభకోణం వంటి ఘటనల ద్వారా పీఎస్ఆర్ ఆంజనేయులు వేలాది మంది యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారని ఆరోపించారు. ఈ కుంభకోణంలో అవినీతికి పాల్పడిన వారికి కొమ్ముకాసి, అర్హులైన అభ్యర్థులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. ఆయన చట్టవ్యతిరేక కార్యకలాపాలు, అధికార దుర్వినియోగం మొత్తం పోలీసు వ్యవస్థకే చెడ్డపేరు తెచ్చాయని విమర్శించారు. చట్టాన్ని అతిక్రమించిన ఏ అధికారి అయినా శిక్ష నుంచి తప్పించుకోలేరనే వాస్తవాన్ని ఈ అరెస్ట్ గుర్తుచేస్తోందని తెలిపారు.