జైపూర్‌లో జేడీ వాన్స్ ఫ్యామిలీకి ఏనుగుల స్వాగతం.. ఇదిగో వీడియో!

  • 4 రోజుల ప‌ర్య‌ట‌న కోసం నిన్న భార‌త్‌కు వ‌చ్చిన జేడీ వాన్స్ ఫ్యామిలీ
  • ఈరోజు ఉద‌యం జైపూర్‌లోని అంబర్ కోట సందర్శన‌
  • ఈ సంద‌ర్భంగా ఉపాధ్యక్షుడి కుటుంబానికి ఘ‌న స్వాగ‌తం
  • వారికి రాజస్థానీ నృత్య ప్రదర్శన, అందంగా అలంకరించబడిన ఏనుగులతో స్వాగతం
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబ‌ స‌మేతంగా నాలుగు రోజుల ప‌ర్య‌ట‌న కోసం సోమ‌వారం భార‌త్‌కు చేరుకున్న విష‌యం తెలిసిందే. నిన్న ప్రధాని మోదీతో భేటీ అనంత‌రం విందులో పాల్గొన్న వాన్స్ రాత్రి తన కుటుంబంతో కలిసి ఢిల్లీ నుంచి జైపూర్ చేరుకున్నారు. మంగళవారం ఉదయం నగరంలోని అంబర్ కోటను సందర్శించారు.

ఈ సంద‌ర్భంగా అంబర్ కోట వద్ద వాన్స్ కుటుంబానికి హృదయపూర్వక, ఉత్సాహభరితమైన ఘ‌న స్వాగతం లభించింది. వారికి సాంప్రదాయ రాజస్థానీ నృత్య ప్రదర్శన, అందంగా అలంకరించబడిన ఏనుగులతో స్వాగతం పలికారు.

తర్వాత‌ ఆయన రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్ (ఆర్ఐసీ)లో అమెరికా-భార‌త్‌ సంబంధాలపై ఉపన్యాసం ఇవ్వనున్నారు. వాన్స్‌, ఆయన భార్య ఉషా వాన్స్, వారి ముగ్గురు పిల్లలు ఇవాన్, వివేక్, మిరాబెల్ హోటల్ రాంబాగ్ ప్యాలెస్‌లో బస చేశారు.

రాజస్థాన్ రాజధానిలోని సిటీ ప్యాలెస్‌ను ఆయన సందర్శించనున్నారు. వారు బుధవారం ఉదయం ఆగ్రాకు బయలుదేరి వెళ్లనున్నారు. అనంత‌రం వాన్స్ కుటుంబం గురువారం తెల్లవారుజామున అమెరికాకు తిరిగి బయలుదేరుతుంది.

ఇక‌, అమెరికా ఉపాధ్యక్షుడు, ఆయన కుటుంబం సోమవారం ఉదయం దేశ రాజధానిలోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా అమెరికా ఉపాధ్య‌క్షుడి పిల్ల‌ల వ‌స్త్ర‌ధార‌ణ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. వారి ఇద్ద‌రు కుమారులు, కూతురు భార‌తీయ సంప్ర‌దాయ దుస్తుల్లో క‌నిపించారు. కుమారులు కుర్తా-పైజామాలు ధరించగా... వారి కుమార్తె అనార్కలి శైలి దుస్తులతో ఎంబ్రాయిడరీ జాకెట్ ధరించ‌డం అంద‌రినీ ఆక‌ట్టుకుంది. 


More Telugu News