మా నాన్న ఆ మాట అన్నప్పుడు చచ్చిపోవాలనిపించింది: అనయ బంగర్

  • లింగ మార్పిడి తర్వాత క్రికెట్ ఆడొద్దన్న తండ్రి సంజయ్ బంగర్
  • అవకాశాల్లేక ఆత్మహత్య ఆలోచన వచ్చిందన్న అనయ
  • గతంలో దేశవాళీ క్రికెట్‌లో యశస్వి, సర్ఫరాజ్‌లతో ఆడిన అనయ
  • ఐసీసీ నిబంధనలే క్రికెట్‌కు దూరం చేశాయన్న భావన
  • సమాజంలోనూ, క్రికెట్‌లోనూ తన లాంటి వాళ్లకు చోటు లేదని ఆవేదన
భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమార్తె అనయ బంగర్, లింగ మార్పిడి తర్వాత తాను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ గురించి, క్రికెట్ కెరీర్‌కు సంబంధించి తన తండ్రి ఇచ్చిన సలహా గురించి చెబుతూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యారు. తాను తీవ్రమైన వేధింపులకు గురయ్యానని, ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయని ఆమె వెల్లడించారు.

'లల్లాన్ టాప్'‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనయ మాట్లాడుతూ, తాను లింగ మార్పిడి చేయించుకున్న తర్వాత క్రికెట్ ఆడవద్దని తన తండ్రి సంజయ్ బంగర్ సలహా ఇచ్చారని తెలిపారు. దీనికి గల కారణాలను కూడా ఆయన వివరించారని ఆమె గుర్తు చేసుకున్నారు. లింగ మార్పిడికి ముందు ఆర్యన్‌గా ఉన్నప్పుడు అనయ క్రికెట్ ఆడారు. యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్ వంటి వర్ధమాన ఆటగాళ్లతో కలిసి ఆమె దేశవాళీ క్రికెట్‌లో పాల్గొన్నారు. అయితే, లింగ మార్పిడి అనంతరం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిబంధనల కారణంగా, ఆమె క్రికెట్‌ను కెరీర్‌గా కొనసాగించే అవకాశం లేకుండా పోయింది.

ఇంటర్వ్యూలో భాగంగా, 'మీ నాన్న క్రికెట్ ఆడొద్దని చెప్పినప్పుడు మీ స్పందన ఏంటి?' అని వ్యాఖ్యాత ప్రశ్నించగా, అనయ మొదట తన తండ్రి గురించి మాట్లాడేందుకు సంశయించారు. ఆ విషయం ఇప్పటికే బహిరంగం అయిందని వ్యాఖ్యాత గుర్తు చేయడంతో, అనయ స్పందిస్తూ, "క్రికెట్‌లో నాలాంటి వాళ్లకు అవకాశం లేదని మా నాన్న అన్నారు. ఆ సమయంలో ప్రపంచమంతా నాకు వ్యతిరేకంగా ఉందనిపించింది. ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనిపించింది" అని తన ఆవేదనను వ్యక్తం చేశారు.

తాను అమ్మాయిగా మారడం వల్లే క్రికెట్‌లో అవకాశాలు, కనీస హక్కులు కూడా లేకుండా పోయాయనే భావన తనను తీవ్రంగా కలచివేసిందని అనయ తెలిపారు. "కుటుంబం నుంచి నాకు కొంత స్వేచ్ఛ, అంగీకారం లభించాయి. కానీ సమాజంలో, ముఖ్యంగా క్రికెట్ ప్రపంచంలో నాకు స్థానం లేదనిపిస్తోంది" అని ఆమె పేర్కొన్నారు. లింగ మార్పిడి తర్వాత ఎదురైన సవాళ్లు, క్రికెట్ కెరీర్‌కు దూరమవ్వాల్సి రావడం వంటి అంశాలపై అనయ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.


More Telugu News