రాజౌరీలో ప్రొఫెసర్‌పై సైనికుల దాడి!
- వాహనాల తనిఖీ సందర్భంగా దాడి చేశారన్న ప్రొఫెసర్
- తన కుటుంబం మొత్తం సైన్యంలోనే ఉందని వెల్లడి
- సోషల్ మీడియాలో వెల్లువెత్తిన విమర్శలు.. విచారణకు ఆర్మీ ఆదేశం
- గుర్తుతెలియని సైనికులపై కేసు నమోదు చేసిన పోలీసులు
ఢిల్లీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ లియాఖత్ అలీ గురువారం రాత్రి రాజౌరి జిల్లాలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. అనంతరం తన బంధువులతో కలిసి కారులో కాలాకోట్‌కు తిరిగి వస్తుండగా లామ్ గ్రామ సమీపంలో వాహన తనిఖీల కోసం సైనికులు ఆపారు. ఈ క్రమంలో తనపై ఎటువంటి కారణం లేకుండానే సైనికులు ఆయుధంతో దాడి చేశారని, తలకు గాయమైందని ప్రొఫెసర్ అలీ ఆరోపించారు. ఈ దాడిలో తనకు దాదాపు ఆరు కుట్లు పడ్డాయని చెప్పారు. తన కుటుంబంలో చాలామంది సైన్యంలోనే ఉన్నారని, అయినా ఇలా జరగడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. తనకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సంఘటనపై సైన్యం స్పందించింది. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి నిర్దిష్ట సమాచారం ఉండటంతో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపింది. ఈ క్రమంలోనే ప్రొఫెసర్ వాహనం ఆపినప్పుడు సైనికుల నుంచి ఆయుధం లాక్కోవడానికి ఆయన ప్రయత్నించారని పేర్కొంది. దీంతో ఘర్షణ జరిగిందని ప్రాథమిక సమాచారం అందినట్లు ఆర్మీ ఒక ప్రకటనలో పేర్కొంది. అయినప్పటికీ, ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించామని, తమ సిబ్బంది ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.