ఘనంగా నటి అభినయ వివాహం

  • చిరకాల ప్రియుడు కార్తీక్‌తో ఏడడుగులు వేసిన అభినయ
  • జూబ్లీహిల్స్‌లోని జెఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో పెళ్లి వేడుక 
  • నూతన వధూవరులను ఆశీర్వదించిన బంధుమిత్రులు
  • ఈ నెల 20న రిసెప్షన్ వేడుక
బహుభాషా నటి అభినయ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆమె తన చిరకాల ప్రియుడు, హైదరాబాద్‌కు చెందిన వేగేశ్న కార్తీక్‌(సన్నీ వర్మ)తో ఏడడుగులు వేశారు. జూబ్లీహిల్స్‌లోని జెఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

అభినయ, కార్తీక్ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. ఆ స్నేహం ప్రేమగా మారింది. గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరు పెద్దల అంగీకారంతో పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారు. అభినయ 2008లో రవితేజ హీరోగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'నేనింతే' సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తున్నారు. ఆమె నటించిన 'ముక్తి అమ్మన్' అనే సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.

అభినయ గతంలో తమిళ స్టార్ హీరో విశాల్‌తో కలిసి 'మార్క్ ఆంటోనీ' అనే సినిమాలో నటించారు. ఆ క్రమంలో ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారని, రహస్యంగా నిశ్చితార్థం కూడా జరిగిపోయిందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ పుకార్లపై విశాల్‌తో పాటు అభినయ కూడా స్పందించారు. అప్పుడే తన లాంగ్ టర్మ్ రిలేషన్, ప్రియుడి గురించి మీడియాకు అభినయ వివరించడంతో పాటు కార్తీక్ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి పుకార్లకు చెక్ పెట్టారు. ఈ క్రమంలో మార్చి 9న అభినయ, కార్తీక్ నిశ్చితార్థం జరిగింది. నిన్న వివాహ బంధంతో ఇద్దరూ ఒకటయ్యారు. ఈ నెల 20న రిసెప్షన్ నిర్వహించనున్నారు. 


More Telugu News