Yakub Habibuddin Tucy: ఔరంగ‌జేబు స‌మాధిని ర‌క్షించాలంటూ ఐక్య‌రాజ్య స‌మితికి మొఘ‌ల్ వార‌సుడి లేఖ‌

Mughal Descendant Writes To UN Seeking Protection Of Aurangzebs Tomb
  • మ‌హారాష్ట్ర‌లోని ఛ‌త్ర‌ప‌తి శంభాజీన‌గ‌ర్ జిల్లా కుల్దాబాద్‌లో ఔరంగ‌జేబు స‌మాధి
  • ఇటీవ‌ల ఛావా సినిమా విడుద‌ల త‌ర్వాత స‌మాధి విష‌యంలో ఘ‌ర్ష‌ణ‌లు
  • ఈ నేప‌థ్యంలో స‌మాధిని ర‌క్షించాలంటూ యాకుబ్ హ‌బీబుద్దీన్ యూఎన్ఓకి లేఖ‌
మ‌హారాష్ట్ర‌లోని ఛ‌త్ర‌ప‌తి శంభాజీన‌గ‌ర్ జిల్లా కుల్దాబాద్‌లో ఉన్న ఔరంగ‌జేబు స‌మాధిని ర‌క్షించాలంటూ మొఘ‌ల్ వార‌సుడు యాకుబ్ హ‌బీబుద్దీన్‌ ట్యూసీ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌కు లేఖ రాశారు. అస‌త్య ప్ర‌చారాల వ‌ల్ల స‌మాధిని కూల్చివేయాలంటూ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రిగాయ‌ని ఆయ‌న లేఖ‌లో పేర్కొన్నారు. 

ఈ సమాధిని 'జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నం'గా ప్రకటించిన‌ట్లు ఆయ‌న గుర్తు చేశారు. పురాతన స్మారక చిహ్నాలు, పురావస్తు ప్రదేశాలు, అవశేషాల చట్టం 1958 కింద ఇది రక్షించబడిందని యాకుబ్ హ‌బీబుద్దీన్ లేఖ‌లో చెప్పారు.

"ఈ చట్టంలోని నిబంధనల ప్రకారం, రక్షిత స్మారక చిహ్నం వద్ద లేదా సమీపంలో ఎటువంటి అనధికార నిర్మాణం, మార్పులు, విధ్వంసం లేదా తవ్వకం చేపట్టకూడదు. అలాంటి ఏదైనా కార్యకలాపాలు చట్టవిరుద్ధమైనవి, చట్ట ప్రకారం శిక్షార్హమైనవిగా పరిగణించబడతాయి" అని యూఎన్ సెక్రటరీ జనరల్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

"సినిమాలు, మీడియా సంస్థలు, సామాజిక వేదికల ద్వారా చారిత్రక వర్గాలను తప్పుగా చూపించడం వల్ల ప్రజల మనోభావాలు దెబ్బ‌తింటున్నాయి. ఫలితంగా అనవసరమైన నిరసనలు, ద్వేషపూరిత ప్రచారాలు, దిష్టిబొమ్మలను దహనం చేయడం వంటి ప్రతీకాత్మక దురాక్రమణ చర్యలు జరిగాయి" అని ఆయన లేఖలో పేర్కొన్నారు.

కాగా, ఇటీవ‌ల వ‌చ్చిన ఛావా సినిమాలో ఔరంజేబును క్రూరాతి కృరుడిగా చూపించిన విష‌యం తెలిసిందే. దాంతో మూవీ చూసిన త‌ర్వాత కొన్ని వ‌ర్గాలు ఆయ‌న స‌మాధి వ‌ద్ద ఆందోళ‌న‌కు దిగాయి. వెంట‌నే స‌మాధిని అక్క‌డి నుంచి తొల‌గించాల‌ని ఆందోళ‌న‌కారులు డిమాండ్ చేశారు. ఇదే విష‌యాన్ని ఆయ‌న త‌న లేఖ‌లో ప్ర‌స్తావించారు.  

1972లో ప్రపంచ సాంస్కృతిక మరియు సహజ వారసత్వ పరిరక్షణకు సంబంధించిన యునెస్కో సదస్సుపై భారతదేశం సంతకం చేయడాన్ని లేఖలో ప్ర‌స్తావించారు. దాని ప్ర‌కారం "ఇటువంటి స్మారక చిహ్నాలను నాశనం చేయడం, నిర్లక్ష్యం చేయడం లేదా చట్టవిరుద్ధంగా మార్చడం వంటి ఏదైనా చర్య అంతర్జాతీయ బాధ్యతలను ఉల్లంఘించడమే అవుతుంది" అని పేర్కొన్నారు.

జాతీయ‌, అంత‌ర్జాతీయ చట్టాల‌ను అనుస‌రించి చారిత్ర‌క క‌ట్ట‌డాల‌ను కాపాడేలా ప్ర‌త్యేక భ‌ద్ర‌త‌ను క‌ల్పించాల‌ని కేంద్ర ప్రభుత్వం, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)ను ఆదేశించాలని ఆయన యూఎన్‌ సెక్రటరీ జనరల్ కార్యాలయాన్ని కోరారు. 

కాగా, గ‌త నెల‌లో ఔరంగ‌జేబు స‌మాధి కేంద్రంగా మ‌త ఘ‌ర్ష‌ణ‌లు జ‌రిగిన విష‌యం తెలిసిందే. మార్చి 17న నాగ్‌పూర్‌లో హింస చెలరేగింది. ఔరంగజేబు సమాధిని తొలగించాలని కొన్ని గ్రూపులు డిమాండ్ చేశాయి. ఈ ఆందోళన సందర్భంగా ఒక వర్గానికి చెందిన పవిత్ర గ్రంథాన్ని తగలబెట్టారనే పుకార్ల మధ్య ఆందోళ‌నకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. అప్పటి నుంచి 92 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
Yakub Habibuddin Tucy
Aurangzeb's Tomb
Kuldaabad
Chhatrapati Sambhajinagar
UNESCO
ASI
India
Mogul Dynasty
Religious clashes
Historical monument

More Telugu News