School Water Tank Poisoning: స్కూల్ వాటర్ ట్యాంకులో విషం కలిపిన దుండగులు.. ఎక్కడంటే?

Poison Found in School Water Tank Adilabad Shocker

  • ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలంలో ఘోరం
  • మధ్యాహ్న భోజన సామాగ్రిపైనా చల్లిన వైనం
  • సిబ్బంది అప్రమత్తతో తప్పిన ముప్పు.. పోలీసులకు హెచ్ఎం ఫిర్యాదు

అదిలాబాద్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విష ప్రయోగం జరిగింది. పిల్లలు, టీచర్లు తాగే నీటి ట్యాంకులో దుండగులు పురుగుల మందు కలిపారు. మధ్యాహ్న భోజన సామగ్రిపైనా విషం చల్లారు. అయితే, మధ్యాహ్న భోజన సిబ్బంది అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన జిల్లాలోని ఇచ్చోడ మండలం ధర్మపురిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ స్కూల్లో 30మంది విద్యార్థులు చదువుకుంటున్నారని అధికారులు తెలిపారు.

శనివారం, ఆదివారం సెలవులు కావడంతో సిబ్బంది పాఠశాలలోని వంటగదికి తాళం వేసి ఇంటికి వెళ్లారు. సోమవారం ఉదయం స్కూలుకు వచ్చిన సిబ్బంది.. మధ్యాహ్న భోజనం కోసం వంట ఏర్పాట్లు ప్రారంభించారు. పాత్రలను శుభ్రం చేసే సమయంలో నీటి నుంచి నురగలు, దుర్వాసన రావడంతో అప్రమత్తమయ్యారు. చుట్టుపక్కల పరిశీలించగా.. వాటర్ ట్యాంక్ సమీపంలో పురుగుల మందు డబ్బా కనిపించిందని సిబ్బంది చెప్పారు.

తాగునీటి ట్యాంకులో పురుగుల మందు కలిపినట్లు గుర్తించారు. దీంతో విద్యార్థులు తాగునీటి కుళాయిల వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మధ్యాహ్న భోజనం వండలేదు. ఈ ఘటనతో స్కూలుతో పాటు గ్రామంలోనూ భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై స్కూలు హెడ్ మాస్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. వాటర్ ట్యాంక్ లో పురుగుమందు కలిపిన దుండగులను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు.

School Water Tank Poisoning
Adilabad District
Government School
Ichoda Mandal
Dharmapuri
Pesticide Contamination
Midday Meal
School Safety
Telangana
Criminal Investigation
  • Loading...

More Telugu News