Zaheer Khan: తండ్రయిన టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్

- మగబిడ్డకు జన్మనిచ్చిన జహీర్ అర్ధాంగి సాగరిక
- చిన్నారికి ఫతేసిన్హ్ ఖాన్‌గా నామకరణం
- ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన జంట
టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ తండ్రి అయ్యాడు. ఆయన అర్ధాంగి సాగరిక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. చిన్నారికి ఫతేసిన్హ్ ఖాన్ అని పేరు పెట్టినట్లు తెలిపారు.
"ప్రేమ, కృతజ్ఞత, దైవ ఆశీర్వాదాలతో మేము మా చిన్న బాబు ఫతేసిన్హ్ ఖాన్‌ను స్వాగతిస్తున్నాము" అని ఆమె రాసుకొచ్చారు. ఈ సందర్భంగా ఈ జంట ఓ అందమైన కుటుంబ ఫొటోను కూడా పంచుకుంది. ఫొటోలో జహీర్ ఖాన్ తన బిడ్డను తన ఒడిలో పట్టుకుని ఉండగా, సాగరిక తన చేతులను జహీర్ భుజాల చుట్టూ ఉంచడం చూడొచ్చు.
తొలి బిడ్డకు స్వాగతం పలికిన జహీర్ ఖాన్ దంపతులకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, 2016లో తోటి క్రికెటర్ యువరాజ్ సింగ్, హాజెల్ కీచ్ సింగ్ వివాహం సందర్భంగా సాగరిక ఘట్గే, జహీర్ ఖాన్ తమ సంబంధాన్ని బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2017లో ఈ జంట వివాహబంధంతో ఒక్కటయ్యారు.