Andhra Pradesh Sports City: ఒలింపిక్ స్థాయిలో కృష్ణా తీరాన 1,600 ఎకరాల్లో క్రీడానగరం?

- ఎన్టీఆర్ జిల్లా మూలపాడు వద్ద 1600 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ
- అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం
- అమరావతిలో స్థల కొరతతో ప్రత్యామ్నాయంగా ఈ ప్రాంతం పరిశీలన
- సాధ్యాసాధ్యాల పరిశీలనకు అధికారులతో కమిటీ ఏర్పాటు
- స్టేడియం నిర్మాణానికి బీసీసీఐ ఆర్థిక సహకారం, మ్యాచ్‌ల కేటాయింపు హామీ
ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడు సమీపంలో, కృష్ణా నది తీరంలో సువిశాలమైన క్రీడా నగరాన్ని (స్పోర్ట్స్ సిటీ) ఏర్పాటు చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పెదలంక, చిన్నలంక గ్రామాల పరిధిలో దాదాపు 1,600 ఎకరాల భూమిని ఇందుకోసం ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ స్పోర్ట్స్ సిటీలో అత్యాధునిక క్రీడా సౌకర్యాలతో పాటు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రికెట్ స్టేడియం నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
వాస్తవానికి, రాజధాని అమరావతి నవనగరాల ప్రణాళికలో భాగంగా స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేయాలని తొలుత భావించారు. అయితే, రాజధాని పరిధిలో భూముల లభ్యత తక్కువగా ఉండటం, స్పోర్ట్స్ సిటీకి అవసరమైన విస్తీర్ణంలో భూమి కేటాయించడం కష్టమని తేలడంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు.
ఈ క్రమంలో కృష్ణా నదికి రెండో వైపున ఉన్న మూలపాడు సమీప ప్రాంతం తెరపైకి వచ్చింది. అమరావతిని, జాతీయ రహదారిని కలిపే ఐకానిక్ వంతెన పూర్తయితే ఈ ప్రాంతం కూడా రాజధానికి చేరువలోనే ఉంటుంది.
ప్రస్తుతం మంగళగిరి వద్ద ఉన్న క్రికెట్ స్టేడియం అంతర్జాతీయ మ్యాచ్‌ల నిర్వహణకు సాంకేతికంగా పూర్తిస్థాయిలో అనుకూలంగా లేదని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అభిప్రాయపడుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా, సుమారు 25,000 మంది ప్రేక్షకుల సామర్థ్యంతో, పార్కింగ్ వంటి అన్ని హంగులతో కూడిన భారీ స్టేడియాన్ని ఈ స్పోర్ట్స్ సిటీలో నిర్మించాలని ఏసీఏ ప్రతిపాదించింది.
దీని నిర్మాణానికి అయ్యే ఖర్చులో 60% భరించేందుకు బీసీసీఐ అంగీకరించగా, మిగిలిన 40% ఏసీఏ సమకూర్చనుంది. స్టేడియం పూర్తయితే ఏటా కనీసం 10 అంతర్జాతీయ మ్యాచ్‌లు కేటాయించేందుకు బీసీసీఐ సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో, పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ సోమవారం ప్రతిపాదిత భూములను స్థానిక ఎమ్మెల్యేలు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ఈ భూముల సాధ్యాసాధ్యాలను క్షుణ్ణంగా పరిశీలించి, సమగ్ర నివేదికను నెల రోజుల్లోగా సమర్పించాలని జిల్లా కలెక్టర్ నేతృత్వంలో జలవనరుల శాఖ, ఇతర అధికారులతో కూడిన కమిటీని మంత్రి ఆదేశించారు.
ఒలింపిక్స్ నిర్వహించే స్థాయి ప్రమాణాలతో స్పోర్ట్స్ సిటీని నిర్మించాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన అని, కమిటీ నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు. గుర్తించిన భూముల్లో ప్రభుత్వ భూములతో పాటు పట్టా భూములు కూడా ఉన్నాయని, భూసేకరణకు తగిన పరిహారం అందించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.