Tirumala Drone Incident: తిరుమల శ్రీవారి ఆలయం వద్ద డ్రోన్ కలకలం

- డ్రోన్ కెమెరా ఎగరేసిన రాజస్థాన్ యూట్యూబర్
- యూట్యూబర్ ను అదుపులోకి తీసుకున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు
- దాదాపు 10 నిమిషాల పాటు వీడియో తీసిన యూట్యూబర్
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతంలో డ్రోన్ ఎగరడం కలకలం రేపింది. అత్యంత పవిత్రమైన, భద్రతాపరంగా కీలకమైన ఈ ప్రాంతంలో మంగళవారం ఓ డ్రోన్ కెమెరాను గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి రాజస్థాన్‌కు చెందిన ఓ యూట్యూబర్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
అధికారులు అందించిన వివరాల ప్రకారం... రాజస్థాన్‌కు చెందిన సదరు యూట్యూబర్ మంగళవారం నాడు దాదాపు పది నిమిషాల పాటు శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాను వినియోగించినట్లు తెలిసింది. అంతకుముందు, ఉదయం నుంచే ఆ వ్యక్తి తిరుమలలోని వివిధ ప్రదేశాలలో వీడియోలు చిత్రీకరిస్తున్నట్లు విజిలెన్స్ సిబ్బంది గుర్తించారు.
డ్రోన్ గగనతలంలో ఎగురుతున్న విషయాన్ని గమనించిన టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తక్షణమే స్పందించారు. ప్రస్తుతం యూట్యూబర్ ను విచారిస్తున్నామని, డ్రోన్ కెమెరా మెమరీ కార్డును స్వాధీనం చేసుకొని అందులోని దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని అధికారులు వెల్లడించారు.
తిరుమల క్షేత్రంలో భద్రతా కారణాల రీత్యా డ్రోన్లు, కెమెరాల వినియోగంపై కఠిన ఆంక్షలు అమలులో ఉన్నాయి. ముఖ్యంగా శ్రీవారి ఆలయం, పరిసర ప్రాంతాలు 'నో ఫ్లై జోన్' పరిధిలోకి వస్తాయి. ఈ నిబంధనలను ఉల్లంఘించి యూట్యూబర్ డ్రోన్ ఎగురవేయడంపై అధికారులు సీరియస్‌గా దృష్టి సారించారు. విచారణ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ ఘటన తిరుమలలో భద్రతా ఏర్పాట్లపై మరోసారి చర్చకు దారితీసింది.