Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు

- భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన అయ్యర్
- మార్చి నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కైవసం
- అవార్డు కోసం అయ్యర్‌తో పాటు కివీస్‌కు చెందిన జాకబ్ డఫీ, రచిన్ రవీంద్ర పోటీ
ఈ ఏడాది భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు మార్చి నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు వరించింది.
ఐసీసీ మెగా ఈవెంట్ ఛాంపియన్స్ ట్రోఫీలో అయ్యర్ 243 రన్స్‌తో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 30 ఏళ్ల ఈ స్టార్ ప్లేయర్ మార్చిలో మూడు మ్యాచ్ ల్లో 57.33 సగటున, 77.47 స్ట్రైక్ రేట్‌తో 172 పరుగులు చేశాడు.
ఇక మార్చి నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కోసం అయ్యర్‌తో పాటు న్యూజిలాండ్‌కు చెందిన జాకబ్ డఫీ, రచిన్ రవీంద్రలు కూడా పోటీ పడ్డారు. వారిద్దరినీ అధిగమించి అయ్యర్ ఈ అవార్డును గెలుచుకోవడం విశేషం. ఈ సందర్భంగా తనకు దక్కిన ఈ గౌరవం పట్ల అయ్యర్ హర్షం వ్యక్తం చేశాడు.
"మార్చి నెలలో ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా ఎంపిక కావడం నాకు నిజంగా గౌరవంగా ఉంది. ఈ గుర్తింపు చాలా ప్రత్యేకమైంది. ముఖ్యంగా మనం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన నెలలో నాకు ఈ అవార్డు రావడాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.
ఇంత పెద్ద వేదికపై భారత్ విజయానికి తోడ్పడగలగడం ప్రతి క్రికెటర్ కల. నా సహచరులు, కోచ్‌లు, సహాయక సిబ్బంది వారి అచంచలమైన మద్దతు, నమ్మకానికి నా కృతజ్ఞతలు. అభిమానులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. వారి ప్రోత్సాహం మమ్మల్ని అడుగడుగునా ముందుకు నడిపిస్తున్నాయి" అని అయ్యర్ తెలిపాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ దశలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అయ్యర్ 98 బంతుల్లో 79 పరుగులు చేశాడు. అలాగే సెమీ-ఫైనల్లో ఆస్ట్రేలియాపై భారతదేశం సాధించిన విజయంలో అతను 62 బంతుల్లో 45 పరుగులు చేసి కీరోల్ పోషించాడు. అలాగే ఫైనల్లో న్యూజిలాండ్‌పై 62 బంతుల్లో 48 రన్స్ బాదిన అయ్యర్, టీమిండియాను గెలిపించాడు.
కాగా, ఈ అవార్డు వరుసగా రెండు నెలలు భారత ప్లేయర్లకే దక్కడం గమనార్హం. ఫిబ్రవరికి గాను యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ ఈ అవార్డును గెలుచుకున్నాడు. ఇక ఇప్పటివరకు ఈ అవార్డును 8 మంది భారత క్రికెటర్లు సాధించారు.
ఇందులో గిల్ మూడు సార్లు గెలిస్తే... జస్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్ రెండేసి సార్లు గెలిచారు. అలాగే విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, రిషభ్ పంత్, యశస్వీ జైస్వాల్ ఒక్కోసారి సాధించారు.